Nita Ambani Old Interview Gone Viral: నీతా అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు. ముకేశ్ అంబానీ భార్యగా మాత్రమే కాదు.. ఆమె ఓ డ్యాన్సర్, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, ఐపీఎల్ టీమ్ యజమాని, వితరణ శీలిగా అందరికీ తెలుసు. అయితే, ఆమె గురించి ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే.. ఆమె ఓ టీచర్ గా కూడా పని చేశారట. ఓ స్కూల్లో నెలకు కేవలం రూ.800 జీతానికి నీతా అంబానీ ఓ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేశారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలపగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ముఖేశ్ అంబానీ, 1985లో నీతా అంబానీని వివాహం చేసుకున్నారు. తర్వాత వీరికి ముగ్గురు పిల్లలు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ. ఆ తర్వాత కొన్నేళ్లకు అంబానీ దంపతులు సిమీ గరేవాల్ షోకు వెళ్లారు. 2000 సంవత్సరం ప్రారంభంలో 'రెండెజ్వస్ విత్ సిమీ గరేవాల్' టాక్ షోలో వీరు పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. పెళ్లయిన ఏడాదిలోనే సన్ ఫ్లవర్ నర్సరీలో టీచర్ గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించినట్లు నీతా అంబానీ తెలిపారు. నెలకు తనకు రూ.800 జీతం మాత్రమే ఉండేదని.. ఆ సమయంలో ఎందరో తనను చూసి నవ్వుకున్నారని చెప్పారు. అయితే, అన్నింటినీ స్వీకరించానని.. ఉపాధ్యాయురాలిగా ఆ ఉద్యోగమే తనకు సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు.
ముకేశ్ అంబానీ జోకులు
అయితే, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్ అంబానీ నీతాపై సరదాగా జోకులు వేశారు. 'నీతా అంబానీ శాలరీ మొత్తం నాదే. మా డిన్నర్లకు ఆమెనే చెల్లించారు.' అంటూ నవ్వుతూ చెప్పారు. ఇటీవల ఈ టాక్ షో వీడియో ఇన్ స్టాలో రాగా తెగ వైరల్ అవుతోంది. నీతా అంబానీ ఆ తర్వాత ఎక్కువ కాలం టీచర్ గా చేయలేకపోయారు. అనంతరం ఆమె ఎన్నో స్కూళ్లను స్థాపించారు. చదువుపై ఇష్టంతో జామ్ నగర్, సూరత్, వడోదర, దహేజ్, లోధివలి, నగోథానే, నాగ్ పుర్, నవీముంబైల్లో పదుల సంఖ్యలో రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ ప్రారంభించారు.
Also Read: New Deal: ముఖేష్ అంబానీ కొత్త డీల్, వయాకామ్‌లో పారామౌంట్ వాటాపై కన్ను