Reliance Industries To Buy Paramounts Stake: దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది. వ్యాపారాన్ని కొత్త రంగాలకు & ప్రాంతాలకు విస్తరించడానికి, నూతన విభాగాల్లోకి అడుగు పెట్టడానికి ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) తరచూ కొత్త ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా, వయాకామ్ 18 మీడియాలో (Viacom18 Media) పారామౌంట్ గ్లోబల్‌కు ఉన్న వాటాను RIL కొనుగోలు చేయబోతోంది.
13 శాతానికి పైగా షేర్ డీల్
ప్రతిపాదిత ఒప్పందం గురించి అమెరికన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్‌కు పారామౌంట్ గ్లోబల్ (Paramount Global) తెలియజేసింది. వయాకామ్ 18 మీడియాలో తనకు ఉన్న వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయడానికి అంగీకరించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పారామౌంట్ గ్లోబల్ వెల్లడించింది. వయాకామ్18 మీడియాలో పారామౌంట్ గ్లోబల్‌కు ఉన్న 13.01 శాతం వాటాను 517 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 4,300 కోట్ల రూపాయలకు RIL కొనే అవకాశం ఉంది.
మరింత బలపడనున్న రిలయన్స్ పట్టు
రిలయన్స్ ఇండస్ట్రీస్ - పారామౌంట్ గ్లోబల్ ప్రధాన వాటాదార్లుగా, కలిసి స్థాపించిన జాయింట్ వెంచర్ (JV) వయాకామ్18 మీడియా. ఈ JV నెట్‌వర్క్‌లో 40కి పైగా టెలివిజన్ ఛానెళ్లు ఉన్నాయి. కామెడీ సెంట్రల్, MTV తోపాటు కొన్ని వార్తా ఛానెళ్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వయాకామ్ 18 మీడియాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇప్పటికే మెజారిటీ వాటా ఉంది. తాజాగా కుదిరిన ఒప్పందంతో, వయాకామ్ 18 మీడియాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ పట్టు మరింత పెరుగుతుంది.
డిస్నీ విలీనం కోసం ఇప్పటికే ఒప్పందం
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇటీవల, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీ ఒప్పందాన్ని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం చేసిన ప్రకటన ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టీవీ & మీడియా వ్యాపారంలో డిస్నీ ఇండియా విలీనం అవుతుంది. ఈ విలీనం పూర్తయిన తర్వాత, వయాకామ్ 18లో పారామౌంట్ గ్లోబల్ వాటాను కొనుగోలు చేసే డీల్‌ను రిలయన్స్ పూర్తి చేస్తుంది.
రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, తన వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అమ్మిన తర్వాత కూడా, వయాకామ్18 మీడియాతో కంటెంట్ లైసెన్సింగ్ ఒప్పందంలో పారామౌంట్ గ్లోబల్ కొనసాగుతుంది. ప్రస్తుతం, జియో సినిమా ప్లాట్‌ఫామ్ ద్వారా పారామౌంట్ గ్లోబల్ కంటెంట్‌ను వీక్షకులకు అందుబాటులో ఉంచారు.
ఈ ఒప్పందం గురించి వయాకామ్ 18 లేదా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
ఈ రోజు (గురువారం, 14 మార్చి 2024) మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 0.49% పెరిగి రూ.2,878.80 వద్ద ఉంది. ఈ స్టాక్ గత ఆరు నెలల్లో 17 శాతం పైగా, గత 12 నెలల్లో 37 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కొత్త ఫాస్టాగ్ తీసుకోకపోతే మీకు రోడ్డుపైనే జాగారం, ఇంకా ఒక్కరోజే గడువు