Indian Railways: సాధారణంగా భారతీయులకు టీ తాగకపోతే ఆరోజు పూట గడిచినట్లే ఉండదు. తెల్లారితే ఓ చుక్క టీ పడాల్సిందే. ఓ కప్పు ఛాయ్ ఎంత ఉంటుంది? రూ.5 లేదా రూ.7 అంతే కదా.. పోనీ ఇంకా కొంచెం ఎక్కువైతే రూ.10. అదే రైల్లో అయితే రూ.10 వరకు ఉంటుంది. కానీ ఓ కప్పు టీ రూ.70 అంటే? ఏంటి అవాక్కయ్యారా? అవును ఓ పాసింజర్‌ దగ్గర రైల్వే శాఖ ఓ కప్పు టీ కోసం రూ.70 తీసుకుంది.


వైరల్


సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ బిల్లు ఫొటో మాత్రం చాలామంది అవాక్కయ్యేలా చేసింది. ఓ సింగిల్‌ ఛాయ్‌కు 70 రూపాయలు ఓ ప్రయాణికుడి నుంచి వసూలు చేసింది ఐఆర్‌సీటీసీ. ఈ విషయంపై నిలదీస్తూ సోషల్‌ మీడియాలో అతను పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్‌ అవుతోంది. 






దిల్లీ నుంచి భోపాల్‌ మధ్య ప్రయాణించే భోపాల్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో జూన్‌ 28న బాధిత వ్యక్తి ప్రయాణించాడు. ఉదయం టీ కోసం 20 రూ. చార్జ్‌ చేసింది ఐఆర్‌సీటీసీ. అయితే సర్వీస్‌ ఛార్జ్‌ పేరిట ఏకంగా రూ.50 తీసుకుంది. ఇది చూసి షాకైన పాసింజర్.. జీఎస్టీ బాదుడంటూ సోషల్‌ మీడియాలో ఆ బిల్లును పోస్ట్‌ చేశాడు. 


రైల్వే వివరణ 


అయితే అది జీఎస్టీ కాదని కేవలం సర్వీస్‌ ఛార్జ్‌ మాత్రమే అని కొంతమంది నెటిజన్లు ఆయనకు రిప్లై ఇచ్చారు. అయినప్పటికీ రూ.50 వసూలు చేయడం దారుణమని కామెంట్లు పెట్టారు. దీంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. నిబంధనల మేరకే వ్యవహరించామని, ఆ ప్రయాణికుడి నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయలేదని తెలిపింది. ఈ మేరకు 2018లో రిలీజ్‌ అయిన ఓ సర్క్యులర్‌ను చూపించింది.


రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి రైళ్లలో రిజర్వేషన్‌ చేసుకున్నప్పుడు.. ఫుడ్‌ బుక్‌ చేసుకోని సందర్భాల్లో  టీ, కాఫీ, ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే అదనంగా రూ.50 సర్వీస్‌ ఛార్జ్‌ కింద వసూలు చేస్తారు. అది సింగిల్‌ ఛాయ్‌ అయినా సరే ఇదే నిబంధన వర్తిస్తుంది.


Also Read: Nupur Sharma Case: దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి: సుప్రీం కోర్టు ఆగ్రహం


Also Read: LPG Cylinder Price: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?