కమర్షియల్ సిలిండర్‌పై భారీ తగ్గింపు
కొద్ది రోజులుగా సిలిండర్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు సరుకుల ధరలూ పెరిగిపోవటం వల్ల నెలవారీ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. వాణిజ్య సిలిండర్‌ల ధరలు పెరగటం వల్ల రెస్టారెంట్‌లు, హోటళ్లు, టీ స్టాల్స్‌పై ప్రభావం పడింది. ఇప్పుడు వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వాణిజ్య సిలిండర్ ధరను రూ.198 మేర తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. దిల్లీలో రూ. 198, కోల్‌కత్తాలో రూ. 182, ముంబయిలో రూ. 190.50 మేర తగ్గగా చెన్నైలో రూ. 187 తగ్గింది. ప్రస్తుతానికి దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2021కి చేరుకుంది. ఈ 19 కిలోల వాణిజ్య సిలిండర్‌లు వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్‌లకు ఇది కొంత మేర ఊరటనివ్వనుంది.
జూన్ 1 వ తేదీ నాటికి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2219గా ఉంది. అంతకు ముందు నెల అంటే..మేలో వాణిజ్య సిలిండర్ ధరను పెంచారు. మే1వ తేదీ నాటికి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 102 మేర పెరగ్గా..అప్పటి ధర రూ. 2355గా ఉంది. ఈ ధరల బాదుడు మార్చి, ఏప్రిల్ నుంచే మొదలైంది. మార్చ్‌లో రూ.105, ఏప్రిల్‌లో రూ. 250 మేర ధరలు పెంచేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో సిలిండర్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. నెల వారీగా ఈ ధరల్లో మార్పులు కనిపిస్తూనే ఉంటాయి.