విపక్ష పార్టీల ఎంపీలు అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో తాము కోరిన అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. పెగాసస్‌తో ఫోన్‌ హ్యాకింగ్‌, సాగు చట్టాలు రద్దు చేయడం లాంటి అంశాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో పార్లమెంట్ సమావేశాలలో గందరగోళం నెలకొంది.  కాంగ్రెస్ సహా ఇతర విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 


లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్ ఓం బిర్లా ఛైర్‌పైకి, ట్రెజరీ బెంచ్‌పైకి విసిరారు. దీంతో మరోసారి సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు అప్పటికే రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. అయితే  విపక్ష ఎంపీలు కాగితాలు చింపి విసిరి వేయడంపై స్పీక‌ర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగితాలు విసిరిన ప‌ది మంది ఎంపీల‌పై వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 


గౌరవప్రదమైన స్పీకర్ స్థానం ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు 374(2) రూల్ ప్ర‌కారం ప‌ది మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్ర‌తాప‌న్‌,హిబీ ఎడెన్, గుర్జీత్ సింగ్ ఔజిలా, మాణికం ఠాగూర్‌, డీన్ కురియ‌కోజ్‌,  జ్యోయిమణి, ర‌వ‌నీత్ బిట్టు, వి వైద్యలింగం, స‌ప్త‌గిరి శంక‌ర్‌, ఏఎం ఆరిఫ్‌, దీప‌క్ బైజ్‌ ఉన్నారు.  భవిష్యత్తులోనూ ఎవరైనా స‌భ్యులు ఇదే తీరుగా స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా ప్ర‌వ‌ర్తిస్తే.. ఈ లోక్‌స‌భ ముగిసేవరకు బహిష్కరించున్నట్లు ఎంపీలను హెచ్చరించారు.


కాగా, నేటి ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి పెగాసస్ వివాదం, సాగు చట్టాల రద్దు అంశంపై ప్లకార్డులతో నినాదాలు చేశారు.  స్పీకర్ మాత్రం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించగా, విపక్ష సభ్యులు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కొందరు పేపర్లు చించివేసి స్పీకర్ ఛైర్, ట్రెజరీ బెంచీలపైకి విసిరేయడంతో స్పీకర్ సభను 12.30 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 


పెద్దల సభ రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు నినాదాలు, నిరసనలతో సభ ఉదయం 12 గంటల వరకు వాయిదా పడింది. విరామం తరువాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు. పెగాసస్ ఫోన్ ట్యాపింగ్, సాగు చట్టాల రద్దుపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబడుతూ నినాదాలు చేశారు.


కాగా,  కేంద్రమంత్రి నుంచి పత్రాలు లాక్కొని, చించివేసి అమర్యాదగా ప్రవర్తించిన టీఎంసీ ఎంపీ శంతను సేన్‌పై ఇటీవల వేటు పడింది. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు రాజ్యసభ సభ్యుడు శంతను సేన్‌ను హాజరుకాకుండా సస్పెండ్‌ చేయడం తెలిసిందే.