దేశవ్యాప్తంగా రోజురోజుకూ వివాదాస్పదం అవుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. తమ ఫోన్లు హ్యాక్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. తాజాగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ సైతం హ్యాక్ అయింది. తన ఫోన్ హ్యాక్ అయిందని, ఎమర్జెన్సీని మించిపోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు. అందువల్ల గత కొంతకాలం నుంచి ఎవరికీ తాను ఫోన్ కాల్స్ చేయలేకపోతున్నానని దీదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కొందరు ప్రముఖులు, ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


పెగాసస్ స్పై వేర్ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తమ వ్యక్తిగత సమాచారం లీక్ చేస్తున్నారని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మమతా బెనర్జీ సైతం పెగాసస్ వివాదంపై ఘాటుగా స్పందించారు. పెగాసస్ అంటే ఏమిటి, అదోక వైరస్. మన భద్రత, వ్యక్తిగత విషయాలు ప్రమాదంలో పడ్డాయని బంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బుధవారం నాడు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ప్రతిపక్ష పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విమర్శలు చేశారు. కానీ తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తన వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొనడం గమనార్హం.


విదేశాలకు చెందిన వైరస్ సాఫ్ట్‌వేర్ పెగాసస్‌పై ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గైర్హాజరు కావడం తెలిసిందే. సమావేశానికి హాజరు అవకున్నా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను కలుసుకుని ఈ వివాదంపై చర్చించాలని ఆమె భావిస్తున్నారు. ఈ క్రమంలో బంగాల్ సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నా ఫోన్ హ్యాక్ అయింది. అభిషేక్ బెజర్జీ ఫోన్ ఇదివరకే హ్యాక్ చేశారు. రాజకీయ వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ మొబైల్ సైతం ట్యాపింగ్ చేశారు. ఇక నేను ఎవరికీ ఫోన్ చేసినా వారి ఫోన్లు సైతం హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది" అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మన జీవితం, ఆస్తులు, భద్రతకు సంబంధించిన విషయం కనుక దీన్ని అంత తేలికగా తీసుకోకూడదన్నారు.


స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టు సొంతంగా విచారణ జరిపించాలని మమతా బెనర్జీ కోరారు. సుప్రీంకోర్టుపై తమకు నమ్మకం ఉందని, విచారణ కచ్చితంగా జరగాలన్నారు. ఇందులో ఏ విషయాలు బయటకు వచ్చినా సుప్రీంకోర్టు వాటి గురించి ఆలోచించదన్నారు. బీజేపీపై పోరాటంలో భాగంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు పెగాసస్ స్పైవేర్ వివాదంపై ఏకతాటిపైకి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, విపక్షాలు కలిపి పనిచేసేందుకు ఏదైనా వేదిక కావాలన్నారు. 


పార్లమెంట్ సమావేశాల అనంతరం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయి దీనిపై చర్చించాలని పేర్కొన్నారు. ఇదివరకే లాలూ ప్రసాద్ యాదవ్ తనకు కాల్ చేసి మాట్లాడారని, తాను నేడు సోనియా గాంధీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశం అవుతున్నానని చెప్పారు.  బీజేపీపై పోరాటానికి ప్రతిపక్ష నేతగా మారుతున్నారా అని మీడియా ప్రశ్నించగా.. తాను రాజకీయ జ్యోతిష్కురాలిని కాదన్నారు. పరిస్థితుల ప్రభావంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఇతరులు నిలబడితే తాను మద్దతిస్తానని మమతా బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.