దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ వినూత్న పోటీ పెట్టింది. త్వరలో తాము ప్రవేశపెట్టబోయే పథకానికి తగిన పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలను సూచించమని కోరుతోంది. మంచి పేరు సూచించిన వారికి భారీ గిఫ్ట్‌లు ఇస్తామని ప్రకటించింది. 
ఏంటా పోటీ.. 
మౌలిక సదుపాయల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టి‍ట్యూషన్‌కి (Development Financial Institution) ఆమోదం తెలిపింది. డీఎఫ్ఐ లక్ష్యాలకు తగినట్లుగా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలను సూచించాలని దేశ ప్రజలను కోరుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఆగస్టు 15వ తేదీలోగా పంపాలని సూచించారు. డీఎఫ్‌ఐ పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలు దేశ సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు ప్రజలందరికీ తేలికగా అర్థం అవ్వాలని, పలకడానికి సులువుగా ఉండాలని తెలిపారు. 




The setting up of a Development Financial Institution was announced by Finance Minister Smt @nsitharaman in Budget 2021-22. Both Houses of Parliament passed the National Bank for Financing Infrastructure and Development (NaBFID) Bill 2021 in March 2021. (2/2) pic.twitter.com/8AFa26Bdxf


— NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021





ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఒక్కో విభాగంలో ఫస్ట్ ప్లేస్ సాధించిన వారికి రూ. 5 లక్షల వంతున మొత్తం రూ. 15 లక్షలు బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఇక రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, 3వ స్థానంలో నిలిచిన వారికి రూ. 2 లక్షల చొప్పున బహుమతులు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు. 
పేరు, ట్యాగ్‌లైన్‌, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్‌ ద్వారా తమ ఎంట్రీలను పంపాల్సి ఉంటుంది. 
డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టి‍ట్యూషన్‌..
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాల్లో డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టి‍ట్యూషన్‌ (డీఎఫ్‌ఐ) ఏర్పాటుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. దీనికి రూ.20,000 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి రూపొందించిన నేషనల్‌ బ్యాంక్ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ - 2021కి ఈ ఏడాది మార్చిలో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. 
డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టి‍ట్యూషన్‌ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.1.11 లక్షల కోట్ల వ్యయంతో 7 వేల ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ పథకం ద్వారా భారతదేశ రూపురేఖలు మారిపోనున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.