Parliament Monsoon Session: మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోసారి ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. హింసాత్మక ఘటనలపై చర్చ చేపట్టాలని, ప్రధాన మంత్రి ప్రకటన చేయాలని విపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, నిరసన మధ్య లోక్‌సభను స్పీకర్, రాజ్యసభను ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చ జరగాల్సిందేనని, సభలో ప్రధాన మంత్రి సమాధానం చెప్పాలని కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధాని సమక్షంలోని మణిపూర్ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. 


ఆప్ ఎంపీ సస్పెండ్, విపక్షాల ఆందోళనలతో రేపటికి వాయిదా


విపక్ష సభ్యుల నిరసనలతో తీవ్ర గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కూడా ఉభయ సభలేవీ పెద్దగా చర్చలు సాగించలేదు. విపక్ష ఎంపీల నిరసనలతో మరోసారి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. రాజ్యసభలో నియామావళిని ఉల్లంఘించారంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఈ వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. మణిపూర్ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్ వెల్ లోకి దూసుకెళ్లి అక్కడ ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ విధించారు. ఆ తర్వాత రాజ్యసభలో నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి ఆప్ ఎంపీ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ఆ తర్వాత రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి రాజ్యసభ సమావేశం కాగా.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ ను విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తూ ఛైర్మన్ ప్రకటించారు. 






మణిపూర్‌పై చర్చిద్దాం: అమిత్ షా X ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలి: విపక్షాలు


మణిపూర్ అంశంపై తప్పకుండా చర్చిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో చెప్పుకొచ్చారు. లోక్‌సభలో మణిపూర్ అంశంపై చర్చను జరగనీయాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ సున్నితమైన అంశానికి సంబంధించిన వివరాలను దేశ ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా చెప్పారు. అమిత్ షా ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకున్న విపక్ష సభ్యులు.. ప్రధాని మోదీ సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. ఈ గందరగోళం మధ్యలోనే నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కమిషన్ బిల్లు -2023 ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.