Cheetahs At Kuno National Park: ప్రాజెక్టు చీతాలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులు చీతాలకు రేడియో కాలర్లు తొలగించినట్లు సోమవారం వెల్లడించారు. మధ్యప్రదేశ్ కునో జాతీయ పార్కులో ఈ చీతాలను సంరక్షిస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి మొత్తం 20 చీతాలను రెండు దశలలో భారత్ కు తీసుకువచ్చారు. కానీ పలు కారణాలతో ఇదివరకే కునో నేషనల్ పార్కులో 8 చీతాలు మృత్యువాత పడ్డాయి. ఇది జంతు ప్రేమికులతో పాటు సామాన్యులను కలచివేస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఆఫ్రికాలో ఉన్న చీతాలను భారత్ కు తరలించడం, ఇక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేకే అవి చనిపోతున్నాయని అటవీ సిబ్బంది, జూ అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. చీతాలకు అమర్చిన రేడియో కాలర్ వల్లే అవి ప్రాణాలు కోల్పోతున్నాయని భిన్న వాదన మొదలైంది. ఈ క్రమంలో అధికారులు కునో నేషనల్ పార్కులో ఆరు చీతాలకు అమర్చిన రేడియో కాలర్లను తాజాగా తొలగించారు. వైద్య పరీక్షలు చేయడానికి రేడియో కాలర్లను తొలగించినట్లు చెప్పారు. వీలైతే రేడియో కాలర్లకు బదులుగా డ్రోన్ లను ఉపయోగిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు.
కునో నేషనల్ పార్కులో 8వ చిరుత మృతి
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో జులై రెండో వారంలో మరో చిరుత మృతి చెందింది. గత నాలుగు నెలల్లో ఇలా చీతా చనిపోవడం ఇది 8వ సారి అని కునో నేషనల్ పార్కు అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నేషనల్ పార్కులో ఆఫ్రికన్ చిరుత సూరజ్ చనిపోయి కనిపించింది. ఈ చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. దీంతో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలలో మరణించిన వాటి సంఖ్య 8కి చేరిందని అధికారులు తెలిపారు. అంతకు కొన్ని రోజుల ముందు కునో పార్కులో తేజస్ అనే ఓ మగ చిరుత చనిపోయిన విషయం తెలిసిందే. మూడ్రోజులు కూడా తిరక్కముందే మరో చిరుత మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. గత మంగళవారం చనిపోయిన తేజస్ చిరుత మెడపై మానిటరింగ్ టీమ్ గాయాలను గుర్తించింది.
ప్రత్యామ్నాయం ఆలోచించండి - కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు
నమీబియా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోయాయి. ఈ మరణాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మిగతా చీతాలను వెంటనే రాజస్థాన్‌కి తరలించాలని సూచించింది. సౌతాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల సంరక్షణపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పింది. గత వారమే రెండు చీతాలు చనిపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాజస్థాన్‌లోని జవాయ్ నేషనల్ సాంక్చురీలో మిగిలిన చీతాలు ఉంచేందుకు అవకాశాలున్నాయేమో చూడాలని ధర్మాసనం సూచించింది. ఉదయ్‌పూర్ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్న Jawai National Park చీతాలకు ఆవాసయోగ్యంగా ఉంటుందో లేదో పరిశీలించాలని చెప్పారు.