భారీ వర్షాలు కురుస్తుండడంతో గుజరాత్ అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జల మయమవుతున్నాయి. జునాగఢ్ జిల్లాలో భారీ వరద ప్రవాహంలో కార్లు, పశువులు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో కారు కోసం వెళ్లి కుటుంబ సభ్యుల కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయాడు. మరోవైపు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు వరదల్లో కొట్టుకుపోయాయి.
160 మిల్లీమీటర్ల వర్షం
శనివారం సాయంత్రం అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కుండపోత వర్షం పడింది. కేవలం ఐదుగంటల్లో 160 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఈ వర్షానికి అహ్మదాబాద్‌లో జన జీవనం స్థంభించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వర్షపు నీరు అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముంచెత్తింది. రన్‌వే సహా, విమానాశ్రయ కారిడార్‌లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన విమానాశ్రయ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటి తరలింపు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక మార్గాల ద్వారా నీటిని బయటకు తోడేశారు.
యథాతథంగా విమానాల రాకపోకలు
ఈ నేపథ్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు నీటిని తోడేసినట్లు ప్రకటించారు. విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అహ్మదాబాద్- రాంచీ విమానాన్ని మాత్రం దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. అది మినహా మిగతా విమానాల రాకపోకలు యథాతథంగా జరిగినట్లు చెప్పారు. పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చేందుకు 200 మంది సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేసినట్లు అధికారులు తెలిపారు.
వెల్లువెత్తున్న విమర్శలు
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులోకి నీరు చేరటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదానీ సంస్థ నిర్వహిస్తున్న ఎయిర్ పోర్టు పరిస్థితి ఇది అంటూ వీడియోలను వైరల్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ కాదని హార్బర్, సీపోర్ట్ అంటూ కొందరు అంటుండగా, నీళ్లలో నడిచే విమానాలు అంటూ వ్యంగ్యంగా వర్ణిస్తున్నారు. విమనాలు ఆలస్యంగా నడవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. గంటలు కొద్ది వేచి చూడాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ స్టేడియం, కొత్త పార్లమెంట్ భవనం, వందే భారత్ రైళ్లు వీడియోలను పోస్ట్ చేస్తూ రైయిన్ హార్వెస్టింగ్ కేంద్రాలుగా ప్రజలకు ఇవి ఉపయోగపడుతున్నాయిని వ్యాఖ్యానిస్తున్నారు.
సీ పోర్టులు నిర్వహించే వారికి ఎయిర్ పోర్ట్ పనులు అప్పగిస్తే ఇలాగే సముద్రపు పోర్టులు నిర్మిస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అహ్మదాబాద్‌కు సముద్రం తీసుకొచ్చారంటూ సటైర్లు వేస్తున్నారు. అహ్మాదాబాద్‌లో మరో నాలుగు నదులు పుట్టించారని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇది కదా నిజమైన గుజరాత్ మోడల్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణం, నిర్వహణ అధ్వాన్నంగా ఉందని మండిపడుతున్నారు.