పార్లమెంట్ బడ్జెట్ 2023 చివరి రోజైన గురువారం (ఏప్రిల్ 6) ప్రతిపక్షాలు అదానీ అంశాన్ని లేవనెత్తి గందరగోళం సృష్టించాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలన్న డిమాండ్ పై విపక్షాలు పట్టుబట్టాయి. అంతే కాదు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ నిర్వహించింది. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, లెఫ్ట్, బీఆర్‌ఎస్‌ వంటి భావసారూప్యత కలిగిన పార్టీలు కూడా ఈ కవాతులో పాల్గొన్నాయి.


కవాతు అనంతరం కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నినాదాలు, ప్లకార్డులతో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి రావడంతో లోక్ సభ నిరవధికంగా వాయిదా పడింది. ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కాంగ్రెస్ సహా 13 ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ సంప్రదాయ టీ విందును బహిష్కరించాయి.


కాంగ్రెస్ పై కిరణ్ రిజిజు ఫైర్


ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించాయని, నల్ల దుస్తులు ధరించి పార్లమెంటును అవమానించాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ ఏం చేస్తుందో దేశం చూస్తోందన్నారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ముఠా సూరత్ కోర్టుకు వెళ్లడం, సభ్యులకు ప్రత్యేక నిబంధనలు ఉండాలని ఒక కాంగ్రెస్ నేత చెప్పడం మనందరం చూశాం. అదే సమయంలో బీజేపీకి కౌంటర్‌గా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం పార్లమెంటును నడవనివ్వడం లేదన్నారు. అదానీ కుంభకోణంపై బీజేపీ ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.


 


నా జీవితంలో ఇలాంటి సభను చూడలేదు -ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు


ఎన్డీయే సర్కారు రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్ 12 నిమిషాల్లో ఆమోదించడం బాధాకరమన్నారు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే. బడ్జెట్ పై చర్చ జరపవద్దని బీజేపీ మొదట్నుంచీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. కానీ ఆటంకం సృష్టించాలనే ఉద్దేశం విపక్షాలకు లేదని ఖర్గే అన్నారు. అధికార పార్టీ సభ్యులే సభను గందరగోళ పరిచారని విమర్శించారు. అసెంబ్లీగానీ, పార్లమెంటులోగానీ నా జీవితంలో ఈ రకమైన వ్యవహారాలు చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము లేవనెత్తిన అదానీ అంశమే అన్ని విపక్ష పార్టీల ఏకైక డిమాండ్ అన్నారు. ఎల్ఐసి, బ్యాంక్ , ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల డబ్బుతో రూ.12 లక్షల కోట్లకు అదాని ఎగబాకారని, ఆ సొమ్మంతా ఎలా వచ్చిందనేనే తమ ఆరోపణ అని ఖర్గే స్పష్టం చేశారు.


ఒక్క క్యాపిటలిస్టుకు అన్ని రంగాలను ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు ఖర్గే. పోర్టులు, ఎయిర్ పోర్టులు, గనులు.. ఇలా ఏదీ వదలకుండా అదానీకి ఎందుకు అప్పగిస్తున్నారని నిలదీశారు. అక్రమమో.. సక్రమమో తేలేందుకే JPC వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. JPC కూర్పు జరిగినా అందులో BJP  వాళ్లేఎక్కువ మంది ఉంటారని.. అయినా ఎందుకు అధికారపార్టీ భయపడుతోందని క్వశ్చన్ చేశారు. JPC వేస్తే పారదర్శకత వస్తుందని.. అదానీ అంశం దృష్టి మరల్చేందుకే రాహుల్ గాంధీ, అనర్హత వేటు, క్షమాపణ అంశాలు తెరపైకి తెచ్చారని ఖర్గే చెప్పుకొచ్చారు.


ఒక్క  వందేభారత్ రైలుని ప్రారభించేందుకు ప్రధానికి ఇంత ఆర్భాటం అవసరమా అని ప్రశ్నించారు. ప్రతి రైల్వేస్టేషనుకు ప్రధాని వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. అక్కడ పార్లమెంట్ సభ్యులు లేరా.. ఇంచార్జ్ మంత్రి ఉండరా అని ప్రశ్నించారు. గుజరాత్ అమ్రేలి స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీకి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది.. మరి ఆయనపై అనర్హత వేటు ఎందుకు వేయలేదని ఖర్గే ప్రశ్నించారు. అదే రాహుల్ గాంధీ అంశంలో మాత్రం మెరుపు వేగంతో స్పందించారని అన్నారు. అసలు అనర్హత వేటు పడిన వ్యక్తి సభలోకి వచ్చి ఎలా క్షమాపణ చెప్తారని ఖర్గే ప్రశ్నించారు..


అదానీ-హిండెన్‌బ‌ర్గ్‌పై చ‌ర్చించేందుకు మోదీ స‌ర్కార్ ఎందుకు భ‌య‌ప‌డుతోందని ప్ర‌శ్నించారు. పెద్దపెద్ద ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం త‌ప్ప.. ప్ర‌ధానికి ప్ర‌జ‌ల కష్టాలు పట్టవన్నారు. పార్ల‌మెంట్‌లో ప్రశ్నించకుండా బీజేపీ అడ్డుకుందని, స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేదన్నారు. మోదీ ప్ర‌జాస్వామ్యం గురించి ఎక్కువ‌గా మాట్లాడుతారు కానీ చ‌ర్య‌ల్లో అది క‌నిపించ‌డం లేద‌న్నారు. ఇది ఏ రకంగానూ రాజకీయం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తామంతా ఐక్యంగా పోరాడుతున్నామని ఖర్గే స్పష్టం చేశారు.


కే. కేశవరావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత


‘’మేం చాలా బలంగా పోరాడుతున్నాం. విపక్షాలను విచ్ఛిన్నం చేయాలని చూసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మేమందరం ఐక్యమత్యంతో ఉన్నా’’- BRS ఎంపీ కే.కేశవరావు