Opposition Meeting:  



జీతేగా భారత్..


INDIA అనే పేరుతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది విపక్ష కూటమి. 26 పార్టీలకు చెందిన నేతలు బెంగళూరులో భేటీ అయిన తరవాత మొట్ట మొదటి అస్త్రంగా ఈ పేరునే బయటకు తీశారు. అప్పటి నుంచి NDA,INDIA మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇదంతా బూటకం అని NDA విమర్శిస్తుండగా...ఈ పేరుని వ్యతిరేకించే వాళ్లు దేశద్రోహులు అంటూ ఎన్‌కౌంటర్ చేస్తున్నారు విపక్ష నేతలు. అయితే..కేవలం పేరు మాత్రమే కాదు. ట్యాగ్‌లైన్‌ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని భావిస్తున్నారు ఈ కూటమిలోని నేతలు. Jeetega Bharat అనే ట్యాగ్‌లైన్ పెడతారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇప్పటికే ఈ విషయం వెల్లడించాయి. "భారత్ గెలిచి తీరుతుంది" అనే అర్థం వచ్చేలా బీజేపీపై యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ట్యాగ్‌లైన్ ఆలోచన వెనకా ఓ కారణముంది. INDIA అనే పేరు బాగున్నప్పటికీ Bharat అని వచ్చేలా ఏదైనా ఉంటే మరింత వెయిటేజ్ పెరుగుతుందని కొందరు నేతలు సూచించారట. అందుకే...పేరులో మార్పు చేయకుండా ఇలా ట్యాగ్‌లైన్ పెట్టాలనే ఆలోచనకు వచ్చారు. అందులో భాగంగానే జీతేగా భారత్ అని ట్యాగ్‌లైన్‌ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. 


పేరు మార్పు..


బెంగళూరులో జరిగిన రెండ్రోజుల భేటీకి 26 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. "United We Stand" అనే నినాదంతో మేమంతా ఒక్కటే అనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నించారు. రెండ్రోజుల చర్చలు ముగిసిన వెంటనే విపక్ష కూటమి పేరు మార్చుతున్నట్టు ప్రకటించారు. ఈ మీటింగ్ జరగక ముందు నుంచే UPA పేరు మారిపోతుందని సమాచారం అందింది. దీనిపై పలువురు నేతల్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. భేటీ ముగిసిన తరవాత అధికారికంగా పేరు మార్చుతున్నట్టు ప్రకటించారు. INDIA అంటే.. 


I - Indian 
N - National 
D - Developmental
I - Inclusive 
A - Alliance


కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఒకే ఐడియాలజీ ఉన్న పార్టీలన్నీ ఒక్కటై చివరి వరకూ కలిసే ఉంటారన్న సంకేతాలిచ్చారు. ఇప్పుడు పేరు పెట్టడం పూర్తైంది కాబట్టి...ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టనుంది కూటమి. 


"రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మా మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు. అది కాదనను. కానీ అవేవీ సైద్ధాంతికపరమైనవి కాదు. పరిష్కరించుకోలేనంత సమస్యలేమీ కావు అవి. సాధారణ పౌరుల కోసం మా విభేదాలన్నింటినీ పక్కన పెట్టి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వెనకబడిన వర్గాల హక్కుల్ని అణిచివేయడాన్ని సహించం"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 
 
ఈ ఏడాది జూన్ 23న తొలిసారి విపక్షాలన్నీ సమావేశమయ్యాయి. అయితే...ఆ సమావేశంలో సోనియా గాంధీ కనిపించలేదు. ఈ సారి మాత్రం ఆమె లీడ్‌ తీసుకుని మరీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే మళ్లీ బలం పుంజుకుంటున్న కాంగ్రెస్‌కి ఇది కలిసొచ్చే అవకాశముంది. సోనియా గాంధీ ఇంకా యాక్టివ్‌గానే ఉన్నారని చెప్పడానికి కాంగ్రెస్‌ ఆమెని ముందు వరసలో ఉంచి మరీ చర్చలు కొనసాగిస్తోంది. 


Also Read: INDIA అనే పేరు పెట్టింది రాహుల్ గాంధీయేనా? మమతా బెనర్జీ ప్రపోజల్‌ని పట్టించుకోలేదా?