CM KCR News: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మరోసారి మహారాష్ట్రలో పర్యటించనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వేటాగ్వ తాలుకా కేంద్రంలో నిర్వహించబోయే కుతారం భావురావ్ సాఠే(అన్నారావు సాఠే) జయంతి వేడుకల్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇటీవలే మహారాష్ట్రకు వెళ్లి కొల్హాపూర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్... మరోసారి మహారాష్ట్రకు వెళ్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భావురావు జయంత్యుత్సవాలు జరగబోయే ప్రాంతం సాంగ్లి జిల్లా కేంద్రానికి 56 కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ వాటేగావ్ గ్రామానికి మహారాష్ట్ర రాజకీయ, సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది.
అసలీ అన్నాభావు రావు సాఠే ఎవరంటే?
మహారాష్ట్ర యువకవిగా, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావురావ్ సాఠే వాటేగావ్ లోనే ఆగస్టు 1వ తేదీ 1920లో జన్మించారు. అయితే ముందు కమ్యూనిస్టుగా ఉన్న ఆయన ఆ తర్వాత మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రీ బాయి పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో దళిత ఉద్యమంలో చేరారు. బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక రచనలు చేశారు మాతంగ సామాజిక వర్గానికి చెందిన అన్నాభావు సాఠే, దళిత జనోద్ధరణ కోసం జీవితాంతం పాటు పడ్డారు. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
రష్యా రాజధాని మాస్కోలోని మార్గరీటా రుడోమినో ఆల్ రషఅయా స్టేట్ అంతర్జాతీయ సాహిత్య గ్రంథాలయం వద్ద లోక్షాహిర్ అన్నాభావు సాఠే విగ్రహాన్ని నెలకొల్పారు. ఈక్రమంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే చిత్ర పటాలతో పాటు భావురావ్ సాఠే చిత్ర పటానికి కూడా పూల మాలలు వేసి నివాళులుల అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లబోతున్న సీఎం కేసీఆర్.. ముందుగా ఛత్రపతి శివాజీ, జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే చిత్ర పటాలకు పూలమాలలు సమర్పిస్తారు. అనంతరం అన్నాభావు రావు సాఠేకు నివాళులు అర్పిస్తారు.
పండరీపూర్ శ్రీ విట్టల్ రుక్మిణీ దేవి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
గతనెల 27వ తేదీన మహారాష్ట్రకు వెళ్లిన సీఎం కేసీఆర్.. పండరీపూర్ వెళ్లి శ్రీ విట్టల్ రుక్మిణీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు, కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ మెడలో తులసీ మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు.. ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పుష్ప గుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం కాషాయ వస్త్రం కప్పారు. అలాగే శ్రీ విఠలేశ్వర స్వామి రుక్మిణీ అమ్మవార్లతో కూడిన చిత్రపటాన్ని సీఎం కేసీఆర్ కు బహుకరించారు. ఆ తర్వాత సీఎం అక్కడి నుంచి సర్కోలీ గ్రామానికి బయలుదేరారు.
స్వామి వారిని ప్రతిమను అందజేసిన వృద్ధ భక్తుడు
దర్శనానంతరం ఆలయ ఆవరణలో నడుచుకుంటూ వస్తుండగా... ఓ వృద్ధ భక్తుడు వచ్చి విఠలేశ్వరుడు, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను బహుకరించారు. అందుకు సీఎం కేసీఆర్ చాలా సంతోషంగా ఫీలై.. వెంటనే ప్రతిమను స్వీకరించారు.