Operation Kaveri : ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం మొదలైంది. సైన్యం, పారామిలటరీ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో సుడాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది, ఆపరేషన్ కావేరి పేరుతో సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకువస్తున్నారు. ఈ ఆపరేషన్ భాగంగా భారతీయుల మొదటి బ్యాచ్ సూడాన్ నుంచి బయలుదేరింది. INS సుమేధ యుద్ధ నౌక 278 మందితో పోర్ట్ సుడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరింది. పోర్ట్ సూడాన్ నుంచి భారతీయులను తరలింపు దృశ్యాలను అల్ అరేబియా ప్రసారం చేసింది. ఓడరేవు వద్ద డాక్ చేసిన INS సుమేధ వీడియో ప్రదర్శించింది.  






3 వేల మంది భారతీయులు 


సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్‌ను మంగళవారం ఆపరేషన్ కావేరీలో భాగంగా స్వదేశానికి తరలిస్తున్నారు. INS సుమేధ 278 మంది భారతీయులతో పోర్ట్ సుడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరింది. సుడాన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరీని ప్రారంభించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం తెలిపారు. సూడాన్‌లోని భారతీయులకు సహాయం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం సూడాన్ లో ఉన్న 3,000 మంది భారతీయ పౌరుల భద్రతపై దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. "ఆపరేషన్ కావేరిలో భాగాంగా సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్ ఆ దేశం నుంచి బయలుదేరింది. 278 మంది వ్యక్తులతో INS సుమేధ పోర్ట్ సుడాన్ నుంచి జెడ్డాకు బయలుదేరింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.






సైన్యం, పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు


సూడాన్‌లో గత 12 రోజులుగా దేశ సైన్యం.. పారామిలిటరీ గ్రూపు మధ్య భీకర పోరు కొన‌సాగుతోంది. ఫ‌లితంగా ఇప్పటి వ‌ర‌కు దాదాపు 400 మంది పౌరులు మరణించారు. ఈ నేప‌థ్యంలో సూడాన్‌లో ఉన్న భారతీయుల శ్రేయస్సు, భద్రతకు హామీ ఇవ్వడానికి భారతదేశం పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్యవ‌హారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. సూడాన్‌లో భ‌ద్ర‌తా ప‌రిస్థితిని సంక్లిష్టత‌ను పరిశీలిస్తున్నామ‌ని తెలిపింది. సూడాన్‌లోని భారతీయుల ర‌క్షణ‌కు వివిధ భాగస్వాములతో సమన్వయం చేసుకుంటున్నామ‌ని వివ‌రించింది. విదేశీ వ్యవ‌హారాల మంత్రిత్వ శాఖ‌, సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఆ దేశ‌ అధికారులతో పాటు, ఐక్యరాజ్యసమితి, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ స‌హా ఇతరులతో తరచూ చ‌ర్చలు జరుపుతుంది.