Twin Towers : బాంబులంటే దీపావళి బంబులు కాదు. వర్జినల్ ఆర్డీఎక్స్. ఇంకా చెప్పాలంటే ప్రత్యేకమైన బాంబులు. భవనాలను ఇట్టే నేల మట్టం చేస్తాయి. ఆ బాంబుల్ని ఉపయోగించి భారీ భవనాలను నేలమట్టం చేయబోతున్నారు. దీనికి ఈ నెల 28వ తేదీనే ముహుర్తం పెట్టారు. నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు అన్ని సిద్ధం అయ్యాయి. సుమారు 3700 కిలోల పేలుడు పదార్ధాలతో ఆ రెండు బిల్డింగ్‌లను పేల్చనున్నారు. దీని కోసం పేలుడు పదార్ధాలను ట్విన్స్ టవర్స్‌లో అమర్చడం పూర్తి అయ్యింది. వచ్చే ఆదివారం ఆ రెండు బిల్డింగ్స్‌ను షెడ్యూల్ ప్రకారం పేల్చి వేయనున్నారు.
క్షణాల్లో కూలిపోనున్న రెండు భవనాలు
పేలుడు పదార్ధాల చార్జింగ్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఇక ఇప్పుడు ట్రంకింగ్ పనులను మొదలుపెట్టనున్నారు. 29 అంతస్తులు ఉన్న సియాన్, 32 అంతస్తులు ఉన్న ఎపెక్స్ టవర్స్‌కు ఆగస్టు 13 నుంచి 40 మంది చార్జింగ్ పనులు చేపట్టారు. ట్విన్ టవర్స్‌ను పేల్చేందుకు ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 26వ తేదీ లోపు చార్జింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని షెడ్యూల్ పెట్టుకున్నామని, ఇక షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 28వ తేదీన మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బిల్డింగ్‌ను పేల్చివేయనున్నట్లు ఎడిఫైస్ అధికారి ఒకరు తెలిపారు.
పేలుడు పదార్థాలను అమర్చేసిన నిపుణులు
రెండు బిల్డింగ్‌లకు కలిపి మొత్తం 20వేల కనెక్షన్లు ఇచ్చారు. అయితే కేవలం ఆదివారం రోజున మాత్రమే డిటోనేటర్‌తో మెయిన్ చార్జింగ్‌కు కనెక్షన్ ఇవ్వనున్నారు. ఎడిఫైస్ ప్రాజెక్ట్ మేనేజర్ మయూర్ మెహతాతో పాటు సౌతాఫ్రికాకు చెందిన జెట్ డెమోలిషన్ సంస్థలోని ఏడు మంది నిపుణులు మాత్రమే పేల్చివేత సమయంలో అక్కడ ఉండనున్నారు.చుట్టుపక్కల భవనాల కోసం ముందు జాగ్రత్త చర్యగా ఎడిఫస్ కంపెనీ రూ.100 కోట్ల బీమా కవరేజీ తీసుకుంది. సెక్టార్ 93-ఏలో ఉన్న ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్‌లోని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వారు.. ఆగస్టు 28న ఉదయం 7 గంటల నుంచి తమ ఫ్లాట్లను ఖాళీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎడిఫస్ కంపెనీ చెప్పిన తర్వాతే తిరిగి ఇళ్లకు రావాలని సూచించారు. చుట్టుపక్కల సొసైటీలు, పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేస్తున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుతున్నారు.
శిథిలాల తొలగింపునకు మూడు నెలలు పట్టే అవకాశం
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్‌ను నిర్మించింది. 2009 లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనల విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది. ఇక కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. వాటి తొలగింపుకు కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.