Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ కు చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా సర్కారు ఉద్యోగం ఇస్తామని తెలిపారు. సోమవారం రోజు కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన మమతా.. రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్న వారికి నగదు సాయం అందిస్తామని తెలిపారు. మంగళ వారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శించినున్నట్లు చెప్పారు.


'రాజకీయాల జోలికి వెళ్లబోను, సాయం గురించే ఆలోచన'


ప్రస్తుతం బెంగాల్ కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని, ఒడిశాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. గాయపడ్డ వారిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారు కటక్ లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. బుధవారం రోజు బాధిత కుటుంబాలను కలిసి పరిహార చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం అందిస్తామన్నారు. రైలు దుర్ఘటన అంశంలో ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లబోనని.. క్షతగాత్రులకు, వారి కుటుంబ సభ్యులకు సాయం గురించే ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. 




'ప్రజలకు వాస్తవాలు తెలియాలి'


రైలు దుర్ఘటనపై కుట్రకోణం ఉందన్న అనుమానాల నేపథ్యంలో రైల్వే బోర్డు సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన అంశంపై మీడియా మమతా బెనర్జీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై స్పందించిన దీదీ.. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. నిజాన్ని అణిచి వేసేందుకు ఇది సమయం కాదని అన్నారు. గతంలో జరిగిన రైలు ప్రమాదాలపై సీబీఐ విచారణ సందర్భాలను గుర్తు చేసిన మమతా బెనర్జీ.. సంవత్సరాలు గడిచినా ఎలాంటి ఫలితం రాలేదని గుర్తు చేశారు. రైల్వే సేఫ్టీ కమిషన్ ఉందని.. సత్వరమే అన్ని చర్యలూ తీసుకోవాలని డిమాండ్ చేశారు.






విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదు: ఒడిశా పోలీసులు


రైలు ప్రమాద దృశ్యాలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని ఒడిశా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎలాంటి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రైలు ప్రమాదం జరిగిన చోటు పక్కనే ఉన్నది ఓ మతానికి చెందిన ప్రార్థనా మందిరమని, ప్రమాదం జరిగిన రోజు ఓ మతానికి పవిత్ర దినమని పోస్టులు పెడుతున్నారు. వీటికి అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వందల్లో కామెంట్లు వస్తుండటంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన ఒడిశా రాష్ట్ర పోలీసులు.. వాటిని అసత్యాలుగా కొట్టిపరేశారు. ఈ దుర్ఘటనపై ఎలాంటి మతపరమైన పోస్టులు పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడం, వాటిని వైరల్ చేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఒడిశా పోలీసులు వరుస ట్వీట్లు చేశారు.