Mukhtar Ansari Life Imprisonment: మాఫియా డాన్, గ్యాంగ్ స్టర్, బీఎస్పీ లీడర్ ముఖ్తార్ అన్సారీని వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు దోషిగా తేల్చింది. అవదేష్ రాయ్ హత్య కేసులో దోషిగా తేల్చడంతో పాటు జీవిత ఖైదు విధించింది. 1991 ఆగస్టు 3వ తేదీన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడైన అవదేష్ రాయ్ ను ముఖ్తార్ అన్సారీ కాల్చి చంపినట్లు అభియోగాలు నమోదు కాగా.. తాజాగా కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయలు జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడుతున్న సమయంలో కోర్టు ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే కిడ్నాప్, హత్య కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు ముఖ్తార్ అన్సారీ. ఈ కేసుల్లో ఏప్రిల్ నెలలో అతడికి కోర్టు శిక్ష విధించింది. దీంతో పాటు అన్సారీపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి.


ఎమ్మెల్యే కాకముందు అవదేష్ రాయ్ హత్య


ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్తార్ అన్సారీ, రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్న సమయంలో 1991లో కాంగ్రెస్ నాయకుడు అవదేష్ రాయ్ ని హత్య చేశారు. ఈ హత్య చేసే సమయానికి అన్సారీ ఇంకా ఎమ్మెల్యేగా గెలవలేదు. ఈ హత్య కేసులో అన్సారీతో పాటు భీమ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ హత్య కేసును సీబీసీఐడీ దర్యాప్తు చేసింది. ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే 2022 జూన్ లో కేసు డైరీ అదృశ్యమైంది. ఫోటో కాపీల ఆధారంగా ఈడీ కేసు విచారణ చేసింది. డూప్లికేట్ పేపర్ల ఆధారంగా తీర్పు వెలువడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


'32 ఏళ్ల కష్టానికి ఇప్పటికి ఫలితం దక్కింది'


అవదేష్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ అన్సారీని దోషిగా తేల్చడంపై ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ స్పందించారు. ఈ పోరాటంలో తమకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 32 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందని వ్యాఖ్యానించారు. వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. అలాగే తనకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత బీజేపీ పార్టీదేనని వ్యాఖ్యానించారు. పట్టపగలు జరిగిన అవదేష్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి భయపడకుండా ఇద్దరు సాక్షులు తమ వాంగ్మూలాలు ఇచ్చినట్లు కోర్టులో అజయ్ రాయ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.


ఆగస్టు 3, 1991న చెట్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని వారణాసిలోని లహురాబీర్ ప్రాంతంలో అవదేష్.. తన సోదరుడు అజయ్ రాయ్ ఇంటి బయట నిలబడి ఉన్న సమయంలో హత్య జరిగింది. దుండగులు మారుతీ వ్యాన్ లో వచ్చిన అవదేష్ పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అవదేష్ ను ఆస్పత్రికి  తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హత్య తర్వాత అజయా రాయ్ ముఖ్తార్ అన్సారీ, భీమ్ సింగ్, కమలేష్ సింగ్, రాకేష్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలాంలపై చెట్ గంచ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుల్లో ఇద్దరు కమలేష్, అబ్దుల్ కలాం మృతి చెందారు.