Odisha Train Accident: 


ట్వీట్..తరవాత డిలీట్..


ఒడిశా రైలు ప్రమాదంపై తమిళనాడుకి చెందిన DMK పార్టీ ప్రతినిధి సైదై సాదిక్‌ బీజేపీపై సెటైరికల్ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని, రైలు ప్రమాదాన్ని పోల్చుతూ పోస్ట్ పెట్టారు. రైల్వే ట్రాక్‌పై డెడ్‌బాడీస్‌ ఉన్న ఓ గ్రాఫికల్‌  ఫోటోని పోస్ట్ చేశారు. "సెంగోల్‌ (Sengol) గురించి ఆలోచనలో మునిగిపోయి సిగ్నల్ గురించి మరిచిపోయారు" అంటూ సెటైర్లు వేశారు. ఈ ట్వీట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌నీ ట్యాగ్ చేశారు. అయితే...ఈ ట్వీట్‌పై పెద్ద దుమారం రేగుతోంది. బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఇప్పుడే కాదు. సాదిక్ గతంలోనూ ఇలాంటి ట్వీట్‌లే చేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. తమిళనాడులోని హీరోయిన్‌లను, బీజేపీ నేతల్ని "ఐటమ్స్" అని కామెంట్స్‌ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నమిత, ఖుష్బూ సుందర్, గౌతమి, గాయత్రి రఘురామ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తరవాత వాళ్లందరికీ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం సెంగోల్‌ని, రైల్వే సిగ్నల్‌ని పోల్చుతూ పెట్టిన ట్వీట్‌పైనా విమర్శలు వచ్చాయి. వెంటనే అలెర్ట్ అయి ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు. 



ప్రియాంక గాంధీ ఫైర్..


రైలు ప్రమాదాలపై ఆర్నెల్ల క్రితమే కాగ్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. పట్టాలు తప్పడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్‌లు జరుగుతున్నట్టు తేల్చి చెప్పింది. ఒడిశా రైలు ప్రమాదంతో ఈ రిపోర్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే..దీనిపై ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. ఆర్నెల్ల ముందే కాగ్ రిపోర్ట్ ఇచ్చినా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. ఇది కేవలం మోదీ సర్కార్ నిర్లక్ష్యమేనని తేల్చి చెబుతున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇదే విషయమై ట్విటర్‌లో విమర్శలు చేశారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ ఇచ్చినా ఎందుకు అప్రమత్తం కాలేదని మండి పడ్డారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఈ ట్వీట్ చేశారు.  


"ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు..? ఉన్నతాధికారులకు ఏ మాత్రం బాధ్యత లేదా..? నిపుణులు, పార్లమెంటరీ కమిటీ, కాగ్‌ ఇచ్చిన రిపోర్ట్‌లు, సలహాలను ఎందుకు పట్టించుకోలేదు? కీలకమైన ప్రాంతాలకు సరైన నిధులు కేటాయించలేదు. ఖాళీగా ఉన్న పోస్ట్‌లనూ భర్తీ చేయలేదు. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు? లాల్‌బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్, మాధవ్ రావ్ సింధియాలా నైతిక బాధ్యత తీసుకుని రైల్వే మంత్రి ఎందుకు రాజీనామా చేయకూడదు" 


- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ