Odisha Train Accident: ఒడిశాలో 288 మంది ప్రాణాలు బలిగొన్న ఘోర రైలు ప్రమాదంపై సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో తరతమ భేదాలు లేకుండా ఒకరికి ఒకరు సాయం చేసుకోవాల్సిన పరిస్థితిలో కొందరు విశృంఖలంగా మతపరమైన పోస్టులు వైరల్ చేస్తున్నారు. వదంతులు వ్యాప్తి చేస్తూ మత కల్లోలాలకు దారి తీస్తున్నారు. అలాంటి వారికి ఒడిశా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 


'మత సామరస్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు'


రైలు ప్రమాద దృశ్యాలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మత విద్వేషాల క్యాప్షన్లు ఇస్తున్నారు. రైలు ప్రమాదం జరిగిన చోటు పక్కనే ఉన్నది ఓ మతానికి చెందిన ప్రార్థనా మందిరమని, ప్రమాదం జరిగిన రోజు ఓ మతానికి పవిత్ర దినమని పోస్టులు పెడుతున్నారు. వీటికి అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వందల్లో కామెంట్లు వస్తుండటంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన ఒడిశా రాష్ట్ర పోలీసులు.. వాటిని అసత్యాలుగా కొట్టిపరేశారు. ఈ దుర్ఘటనపై ఎలాంటి మతపరమైన పోస్టులు పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడం, వాటిని వైరల్ చేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఒడిశా పోలీసులు వరుస ట్వీట్లు చేశారు.















రైల్వే శాఖ ఆదేశాలు.. 
ఒడిశా ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సిగ్నలింగ్ సిస్టమ్‌పై సేఫ్‌టీ డ్రైవ్ (Railway Signalling Safety Drive) చేపట్టాలని ఆదేశించింది. స్టేషన్లలోని సిగ్నలింగ్ పరికరాలు ఎలా పని చేస్తున్నాయో చెక్ చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ పరికరాలుండే గదులకు "డబుల్ లాకింగ్ సిస్టమ్" ఉందో లేదో చూడాలని వెల్లడించింది. ఈ సిగ్నలింగ్ అప్పారటస్ (signalling apparatus) ఉండే గదులను రిలే రూమ్స్‌గా (Relay Rooms) పిలుస్తారు. వీటిని Two Fold లాకింగ్ సిస్టమ్‌తో లాక్ చేసేస్తారు. ఈ రూమ్‌ని స్టేషన్‌ మాస్టర్‌తో పాటు సిగ్నలింగ్ స్టాఫ్‌ కూడా ఓపెన్ చేస్తేనే తెరుచుకుంటాయి.


మధ్య మధ్యలో ఇలాంటి సేఫ్‌టీ డ్రైవ్‌లు నిర్వహిస్తుంటారు. భద్రతలో ఎంతో కీలకమైన పరికరాలు సరైన విధంగా పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఈ డ్రైవ్‌లు ఉపయోగపడతాయి. ఒడిశా రైలు ప్రమాదంతో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలున్నాయన్న వాదనలు మొదలయ్యాయి. రైల్వే బోర్డ్ వివరణ ఇచ్చినప్పటికీ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే...వారం రోజుల పాటు అన్ని చోట్లా సేఫ్‌టీ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించుకుంది రైల్వేశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.