Odisha Train Accident:



రైల్వే శాఖ ఆదేశాలు..


ఒడిశా ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సిగ్నలింగ్ సిస్టమ్‌పై సేఫ్‌టీ డ్రైవ్ (Railway Signalling Safety Drive) చేపట్టాలని ఆదేశించింది. స్టేషన్లలోని సిగ్నలింగ్ పరికరాలు ఎలా పని చేస్తున్నాయో చెక్ చేసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ పరికరాలుండే గదులకు "డబుల్ లాకింగ్ సిస్టమ్" ఉందో లేదో చూడాలని వెల్లడించింది. ఈ సిగ్నలింగ్ అప్పారటస్ (signalling apparatus) ఉండే గదులను రిలే రూమ్స్‌గా (Relay Rooms) పిలుస్తారు. వీటిని Two Fold లాకింగ్ సిస్టమ్‌తో లాక్ చేసేస్తారు. ఈ రూమ్‌ని స్టేషన్‌ మాస్టర్‌తో పాటు సిగ్నలింగ్ స్టాఫ్‌ కూడా ఓపెన్ చేస్తేనే తెరుచుకుంటాయి. మధ్య మధ్యలో ఇలాంటి సేఫ్‌టీ డ్రైవ్‌లు నిర్వహిస్తుంటారు. భద్రతలో ఎంతో కీలకమైన పరికరాలు సరైన విధంగా పని చేస్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఈ డ్రైవ్‌లు ఉపయోగపడతాయి. ఒడిశా రైలు ప్రమాదంతో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలున్నాయన్న వాదనలు మొదలయ్యాయి. రైల్వే బోర్డ్ వివరణ ఇచ్చినప్పటికీ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే...వారం రోజుల పాటు అన్ని చోట్లా సేఫ్‌టీ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించుకుంది రైల్వేశాఖ. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 


"సిగ్నలింగ్ ఎక్విప్‌మెంట్ ఉన్న అన్ని క్యాబిన్స్‌ని చెక్‌ చేయాలి. డబుల్ లాకింగ్ అరేంజ్‌మెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. డేటా లాగింగ్‌తో పాటు రిలే రూమ్స్‌ని ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు SMS అలెర్ట్స్ వస్తున్నాయా లేదా పరిశీలించాలి. సిగ్నలింగ్ ఎక్విప్‌మెంట్‌ కనెక్షన్, డిస్‌కనెక్షన్‌ సరిగ్గా అవుతున్నాయా లేదా సరి చూసుకోవాలి."


- రైల్వే శాఖ 


ఈ రిలే రూమ్స్‌ని తెరవడానికి ప్రయత్నించినా, మూయాలని చూసినా వెంటనే సంబంధిత అధికారులకు SMS అలెర్ట్ వెళ్తుంది. సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారం ఈ వ్యవస్థను రూపొందించారు. పొరపాటున కూడా అనధికారిక వ్యక్తులెవరూ ఆ రూమ్‌లోకి వెళ్లకుండా నియంత్రిస్తుంది ఈ సిస్టమ్.


CBI విచారణ..


కోరమండల్ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. సీబీఐ సమగ్ర దర్యాప్తుతో ప్రమాదానికి కారణాలు, బాధ్యులెవరో తేలుతుందన్నారు. రైలు ప్రమాదం ఘటనలో ఇప్పటికే 275 మంది ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, పాయింట్ మెషీన్‌లో చేసిన మార్పు వల్ల రైలు ప్రమాదం జరిగిందని బాలాసోర్ జిల్లాలో ప్రమాద స్థలంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగించాలని భావిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రైల్వే బోర్డు తరఫున రైలు ప్రమాదం దర్యాప్తును సీబీఐ చేపట్టాలని సిఫారసు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఎవరైనా బయటి వ్యక్తులు స్టేషన్ మాస్టార్ రూములోకి వెళ్లారా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.