Odisha Train Accident: 


ప్రధాని మోదీకి లేఖ రాసిన ఖర్గే 


ఒడిశా రైలు ప్రమాదంపై ప్రతిపక్షాలు భగ్గమంటున్నాయి. కవచ్ సిస్టమ్‌ ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నిస్తున్నాయి. మోదీ సర్కార్ వైఫల్యం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ బీజేపీకి గురి పెట్టింది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేయగా...ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా స్పందించారు. ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ఈ ప్రమాదంపై ఎన్నో అనుమానాలున్నాయన్న ఖర్గే...మోదీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తప్పుడు నిర్ణయాలతో రైల్వేని ప్రమాదంలోకి నెట్టేశారని ఆరోపించారు. "మోదీ సర్కార్ తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల రైల్వే ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దేశ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది" అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పైనా విమర్శలు చేశారు ఖర్గే. ప్రమాదంపై విచారణకు సీబీఐని నియమించడాన్నీ తప్పుపట్టారు. నేర సంఘటనల్ని ఇన్వెస్టిగేట్‌ చేసే సీబీఐకి రైల్వేతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలకు సీబీఐ ఎలాంటి బాధ్యత వహించలేదని తేల్చి చెప్పారు. 


"సీబీఐ ఉన్నది కేవలం నేర సంఘటనల్ని విచారించేందుకు. రైల్వే ప్రమాదాలకు సీబీఐకి ఏంటి సంబంధం? సీబీఐ మాత్రమే కాదు. మరే దర్యాప్తు సంస్థకీ దీంతో పని లేదు. టెక్నికల్‌, పొలిటికల్ ఫెయిల్యూర్స్‌కి సీబీఐ ఎలా బాధ్యత వహిస్తుంది? రైల్వే సేఫ్‌టీ గురించి వీళ్లకు ఏం అవగాహన ఉంటుంది? సేఫ్‌టీ సిగ్నలింగ్‌ గురించి తెలుస్తుందా?"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 






రైల్వేలో సంస్కరణలు తీసుకొస్తున్నామని మోదీ సర్కార్ ప్రచారం చేసుకుంటుందే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు ఖర్గే. రైల్వేపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండి పడ్డారు. 


"ఏళ్లు గడిచే కొద్ది రైల్వేని మరింత సంస్కరించాలి. సామర్థ్యం పెంచాలి. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ వదిలేసి మోదీ ప్రభుత్వం రైల్వేపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోంది. ప్రమాదం ఎందుకు జరిగిందో అని రైల్వే మంత్రే స్వయంగా చెబుతున్నారు. మళ్లీ ఆయనే సీబీఐకి అప్పగించామని అంటున్నారు. 2016లో కూడా కాన్‌పూర్‌లో రైలు ప్రమాదం జరిగితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ చేపట్టాలని అన్నారు. ఆ తరవాత 2017లో ఏ ఎన్నికల ర్యాలీలో అది ప్రమాదం కాదు కుట్ర అని తేల్చి చెప్పారు. ఇప్పుడు జరిగింది కూడా కుట్రే అయితే అందుకు కారకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలి"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 


 Also Read: Coromandel Train Accident: వెనక నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయ్, కాసేపు స్పృహలోనే ఉన్నాను - కోరమాండల్ డ్రైవర్