Wrestlers Protest:
స్టేట్‌మెంట్ విత్‌డ్రా..
నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళనలు చేపడుతున్నారు. WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ని అరెస్ట్ చేయాలని ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే 7గురు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పోలీసులు వీరందరి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ కీలక పరిణామం జరిగింది. ఈ 7గురు బాధితుల్లో మైనర్ రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చేసిన ఆరోపణల్ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. పటియాలా హౌజ్ కోర్ట్‌లో పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్జ్ చేయగా...ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంది. ప్రస్తుతానికి బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదయ్యాయి. దాదాపు 10 కేసులు పెట్టారు పోలీసులు. ఈ FIRలో ఆ మైనర్ రెజ్లర్ కూడా పలు ఆరోపణలు చేసింది. చాలా సందర్భాల్లో తనను అసభ్యంగా తాకారని చెప్పింది. కావాలనే భుజంపై చేతులు వేసి ఎక్కడెక్కడో ముట్టుకున్నాడని తెలిపింది. "నువ్వు నాకు సపోర్ట్ చేస్తే...నేను నీకు సపోర్ట్ చేస్తా" అని చెప్పినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాను 16 ఏళ్ల వయసులో ఉండగా ఇదంతా జరిగిందని చెప్పింది. తనతో సన్నిహితంగా ఉండకపోతే వచ్చే ఛాంపియన్‌షిప్‌లలో ఆడకుండా చేస్తానని బెదిరించినట్టు...ఆ మైనర్ రెజ్లర్ తండ్రి ఆరోపించారు. ఇన్ని ఆరోపణలు చేసి ఉన్నట్టుండి ఆమె తన స్టేట్‌మెంట్‌ని ఎందుకు వెనక్కి తీసుకుందన్నదే అంతు తేలకుండా ఉంది.
బ్రిజ్ భూషణ్ వర్సెస్ రెజ్లర్ల వివాదంలో ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న బీజేపీ హైకమాండ్ ఇప్పుడు యాక్షన్‌లోకి దిగినట్టే కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...రెజ్లర్ల ఆందోళనలపై "అనవసర వ్యాఖ్యలు" చేయొద్దని బ్రిజ్ భూషణ్‌ని హైకమాండ్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అంతే కాదు. జూన్ 5వ తేదీన భారీగా ర్యాలీ చేపట్టాలని భూషణ్ డిసైడ్ అయినా...అధిష్ఠానం మాత్రం అందుకు అంగీకరించలేదు. ర్యాలీ చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన తరవాతే ఆయన ఉపసంహరించుకున్నట్టు సమాచారం. అయోధ్యలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటే...అది కాస్తా సైడ్ అయిపోయింది. ఫేస్‌బుక్‌లో ఇదే విషయం వెల్లడించారు బ్రిజ్ భూషణ్. అనివార్య కారణాల వల్ల ర్యాలీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
"నేను 28 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎంపీగా మీ అందరికీ చేరువయ్యాను. అన్ని వర్గాలకు చెందిన ప్రజల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాను. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ నా వైఖరి మారలేదు. కానీ...నాపై మాత్రం కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారని తెలుసు. మతసామరస్యాన్ని దెబ్బ తీయాలనీ కొందరు చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే అయోధ్యలో జూన్ 5వ తేదీన సనాతన సమ్మేళన్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. కానీ...పోలీసుల విచారణ, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఈ ర్యాలీని వాయిదా వేస్తున్నాను. ఇప్పటి వరకూ నాకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను"
- బ్రిజ్ భూషణ్ సింగ్, బీజేపీ ఎంపీ