Coromandel Express Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దుర్ఘటనలో మృతుల సంఖ్యపై వివాదం కొనసాగుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం 288 మంది చనిపోయారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేనా మంగళవారం వెల్లడించారు. మీడియాతో ఒడిశా సీఎస్ మాట్లాడుతూ.. బాలాసోర్ జిల్లా కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 288 అని చెప్పారు. ఇందులో ఇప్పటివరకూ 205 మృతదేహాలను తరలించామని ప్రదీప్ జేనా తెలిపారు. కాగా, శనివారం రోజు మధ్యాహ్నం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇదే సంఖ్య ప్రకటించి, ఆపై 275 అని ఒడిశా సర్కార్ సవరించుకుంది. కానీ మంగళవారం మరోసారి ఒడిశా సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు.






రైల్వే పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ టీమ్, ఇతర సిబ్బంది సహాయ చర్యలలో పాల్గొని సాధ్యమైనంత త్వరగా బాధితులను ఆసుపత్రులకు తరలించారని అభినందించారు. ఆసుపత్రుల నుంచి గాయపడ్డ వారి వివరాలు, మృతుల వివరాలు సేకరిస్తున్నామని ఒడిశా సీఎం చెప్పారు. పూర్తి వివరాలు సేకరించిన తరువాత బాలాసోర్ కలెక్టర్ తమకు ఈ సమాచారం అందించారని సీఎస్ పేర్కొన్నారు. కొందరి మృతదేహాలను గుర్తించలేకపోతున్నామని, అధికారులు ఎలాగైనా గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు. ఎవరి కుటుంబసభ్యులు మిస్ అయితే ప్రభుత్వం, రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ నెంబర్, హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలిపాలని సూచించారు.


ప్రతిపక్షాల మండిపాటు..!
రైలు ప్రమాదం ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని, కానీ కేంద్ర ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై, రైల్వే శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. 500కు పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారు, కానీ కేంద్రం నిజాలు దాచిపెడుతోందని ఆరోపించారు. మమతా మంగళవారం సైతం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం, రైల్వే శాఖ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అయితే కేసును సీబీఐకి అప్పగించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


వెలుగులోకి షాకింగ్ విషయాలు..
కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం 288 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ తో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది.. బోగీల నుండి మృతదేహాలను వెలికితీయగా.. అయితే ఓ బోగీలో నుంచి దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.