Odisha Train Accident: ఒడిశాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ వచ్చే చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది.. బోగీల నుండి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఓ బోగీలో నుంచి దాదాపు 40 మృతదేహాలను బయటకు తీయగా.. వాటిపై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగినట్లు రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. 


కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూరు - హావ్ డా ఎక్స్‌ప్రెస్‌ కు.. కోరమాండల్ బోగీలు ఢీకొట్టడంతో ఆ రైలు వెనక ఉన్న పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ కరెంట్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కరెంట్ పాసై విద్యుదాఘాతం జరిగిందని రైల్వే పోలీసు అధికారులు చెబుతున్నారు. బోగీల మధ్య నలిగిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని..  కానీ దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని అధికారులు చెప్పారు. ఆ మృతదేహాలపై రక్త స్రావం జరిగిన ఆనవాళ్లు కూడా లేవన్నారు. బోగీలపై లోటెన్షన్ వైర్లు పడి విద్యుత్ ప్రసరించడంతోనే ఆ 40 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.


'మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేం'


రైలు దుర్ఘనటలో మొత్తం 278 మంది మృతి చెందగా.. అందులో 100 మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోయారు. వాళ్లు ఎవరూ అనేది ఇప్పటికీ అధికారులు తేల్చలేదు. ఇప్పటికే 80 గంటలు గడిచిపోయాయి. ముక్కలుగా మారిన మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేమని ఢిల్లీలోని ప్రీమియర్ ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడు ఒకరూ చెబుతున్నారు. మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించేంత వరకు ఎంబామ్ చేసైనా భద్రపరచాలని భావిస్తున్నారని, కానీ ఎంబామింగ్ ప్రక్రియ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆ వైద్యుడు చెబుతున్నారు. ముక్కలైన మృతదేహాలను ఎక్కువ సేపు ఉంచడం కూడా అడ్వైజబుల్ కాదని చెప్పారు. ఇప్పటికే డీఎన్ఏ మ్యాచింగ్ కోసం రక్త నమూనాలను కూడా సేకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 


12 గంటల్లోపు ఎంబామింగ్ చేస్తేనే మృతదేహాలు భద్రపరచవచ్చు


మృతి చెందిన తర్వాత 12 గంటల్లోపు ఎంబామింగ్ సరిగ్గా చేస్తేనే మృతదేహాన్ని సంవత్సరాల తరబడి భద్రపరచవచ్చని ఎయిమ్స్ అనాటమీ విభాగాధిపతి షరీఫ్ తెలిపారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకపోతే శరీరాలు 12 గంటల వరకు కూడా బాగానే ఉంటాయన్నారు. ఐస్, కోల్డ్ స్టోరేజ్ మృతదేహం కుళ్లిపోవడాన్ని ఆలస్యం చేస్తుందని చెప్పారు.