Odisha Train Accident:
శవాల మధ్యలో కొడుకు..
ఒడిశా రైలు ప్రమాద విషాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. రోజుకో కన్నీటి గాథ వినిపిస్తూనే ఉంది. చనిపోయిన వారి మృతదేహాలను వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించడం సవాలుగా మారింది. చాలా ఆసుపత్రుల్లో శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. కొంత మందిని గుర్తించి అప్పగించినా...ఇంకా గుర్తించనివి ఉన్నాయి. హాస్పిటల్స్ దగ్గర కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. తమ వాళ్లు ఎక్కడున్నారో వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే గుండెని మెలిపెట్టే సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన కొడుకుని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్లిన ఓ తండ్రి...అక్కడి పరిస్థితులు చూసి గుండె పగిలిపోయాడు. అన్ని గదుల్లోకి వెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడోనని చాలా సేపు వెతికాడు. చివరకు డెడ్‌బాడీస్ మధ్య కనిపించాడు. అది చూసి చలించిపోయాడు. "బతికున్న నా కొడుకుని శవాల మధ్యలో పడేస్తారా" అని గుక్కపట్టి ఏడ్చాడు.
"నా కొడుక్కి తీవ్ర గాయమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రెస్క్యూ టీమ్ అది గమనించలేదు. చనిపోయాడనుకుని శవాల మధ్యలో పడేశారు. ప్రమాద వార్త వినగానే బయల్దేరి వచ్చాను. మా ఊరు ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చే సరికి ఆలస్యమైంది. ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి నా కొడుకు కోసం చూస్తూనే ఉన్నాను. ఎక్కడా కనిపించలేదు. ఓ గదికి వెళ్లాను అన్నీ శవాలే ఉన్నాయి. మధ్యలో నా కొడుకు కనిపించాడు. వాడు బతికే ఉన్నాడు. అయినా వాడిని శవాల మధ్యలో పడేశారు. వెంటనే వాడిని ఎత్తుకుని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లిపోయాను. చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మా వాడు కాల్ చేశాడు. బాగా గాయాలయ్యాయని, స్పృహ తప్పుతోందని చెప్పాడు. అప్పటి నుంచి ఏ సమాచారం లేదు. ఇక్కడికి వచ్చాక అతి కష్టం మీద గుర్తించాను"
- బాధితుడి తండ్రి
మరణాల సంఖ్యపై క్లారిటీ..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దుర్ఘటనలో మృతుల సంఖ్యపై వివాదం కొనసాగుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం 288 మంది చనిపోయారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జేనా మంగళవారం వెల్లడించారు. మీడియాతో ఒడిశా సీఎస్ మాట్లాడుతూ.. బాలాసోర్ జిల్లా కలెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 288 అని చెప్పారు. ఇందులో ఇప్పటివరకూ 205 మృతదేహాలను తరలించామని ప్రదీప్ జేనా తెలిపారు. కాగా, శనివారం రోజు మధ్యాహ్నం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య ఇదే సంఖ్య ప్రకటించి, ఆపై 275 అని ఒడిశా సర్కార్ సవరించుకుంది. కానీ మంగళవారం మరోసారి ఒడిశా సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై స్పష్టత ఇచ్చారు.రైల్వే పోలీసులు, ఎన్టీఆర్ఎఫ్ టీమ్, ఇతర సిబ్బంది సహాయ చర్యలలో పాల్గొని సాధ్యమైనంత త్వరగా బాధితులను ఆసుపత్రులకు తరలించారని అభినందించారు.