Odisha Train Accident: మాటలకందని మహా విషాద ఘటన ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలోమొత్తం 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీలో ఉంచారు. ఈ క్రమంలోనే మృతదేహాలను గుర్తించేందుకు వెళ్లిన ఓ అధికారికి భయానక ఘటన ఎదురైంది.


 మార్చురీలోంచి ఆ అధికారి బయటకు నడుచుకుంటూ వెళ్తుంటే.. సడెన్ గా ఎవరో ఆయన కాలును పట్టుకున్నారు. దీంతో ఆ అధికారి ఫ్యూజుల అవుట్‌ అయ్యాయి. ప్రాణ భయంతో వణికిపోతూ కిందికి చూశాడు. ఎవరో అని చూసే సరికి చనిపోయాడనుకొని మార్చురీలో పడుకోబెట్టిన వ్యక్తి తన కాళ్లు పట్టుకున్నాడు. అదే భయంతో కేకలు వేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది వచ్చి చూస్తే వారంతా కూడా షాక్ అయ్యారు.


అసలేం జరిగిందంటే?


మృతదేహాలను ఉంచేందుకు అధికారులు ఓ పాఠశాలలో మార్చురీని ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే రెస్క్యూ టీం సభ్యుడు అటుగా వెళ్తుంటే ఓ వ్యక్తి అతని కాలును పట్టుకున్నాడు. విపరీతంగా భయపడుతూనే.. అతనెవరో చూసే ప్రయత్నం చేశాడు అధికారి. ఈక్రమంలోనే అతడు 35 ఏళ్ల వయసు ఉన్న రాబిన్ నయాగా గుర్తించారు. అతను రెండు కాళ్లు కట్ అయిపోయి బతికి ఉండడాన్ని గమనించి వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


సహాయక సిబ్బందిలో మానసిక సమస్యలు 


మరోవైపు ప్రమాదంలో చిక్కుకున్న వారే కాకుండా వారికి సాయం చేసిన సిబ్బంది కూడా ఇబ్బంది పడుతోంది. ఆ భయానక దృశ్యాలు చూసిన వారంతా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తాగే నీటిని చూసినా వారికి అది రక్తంలా కనిపిస్తోంది. గది నిండ తెగిపడిన కాళ్లు చేతులు, మొండేలు ఉన్నట్టు రాత్రి పూట ఉలిక్కి పడి లేస్తున్నారట. 


ప్రమాదవశాత్తు కాదు! విద్యుదాఘాతం కారణంగా 40 మంది మృతి


కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం 288 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ తో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది.. బోగీల నుండి మృతదేహాలను వెలికితీయగా.. అయితే ఓ బోగీలో నుంచి దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 


ప్రతిపక్షాల మండిపాటు..!


రైలు ప్రమాదం ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని, కానీ కేంద్ర ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై, రైల్వే శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. 500కు పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారు, కానీ కేంద్రం నిజాలు దాచిపెడుతోందని ఆరోపించారు. మమతా మంగళవారం సైతం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం, రైల్వే శాఖ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అయితే కేసును సీబీఐకి అప్పగించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



'మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేం'


రైలు దుర్ఘనటలో మొత్తం 288 మంది మృతి చెందగా.. అందులో 100 మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోయారు. వాళ్లు ఎవరూ అనేది ఇప్పటికీ అధికారులు తేల్చలేదు. ఇప్పటికే 80 గంటలు గడిచిపోయాయి. ముక్కలుగా మారిన మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేమని ఢిల్లీలోని ప్రీమియర్ ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడు ఒకరూ చెబుతున్నారు. మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించేంత వరకు ఎంబామ్ చేసైనా భద్రపరచాలని భావిస్తున్నారని, కానీ ఎంబామింగ్ ప్రక్రియ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆ వైద్యుడు చెబుతున్నారు. ముక్కలైన మృతదేహాలను ఎక్కువ సేపు ఉంచడం కూడా అడ్వైజబుల్ కాదని చెప్పారు. ఇప్పటికే డీఎన్ఏ మ్యాచింగ్ కోసం రక్త నమూనాలను కూడా సేకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.