వేడి వేడి టీ వాటిలో ఒక రెండు బిస్కెట్స్ నంచుకుని తినడం చాలా మందికి ఉన్న అలవాటు. ఈవినింగ్ స్నాక్స్ గా ఎక్కువగా తీసుకుంటారు. కాసేపు స్నేహితులతో కలిసి కూర్చుని ఛాయ్ బిస్కెట్ తింటుంటే బాగుంటుంది. కానీ నిజానికి ఇది ఆరోగ్యానికి ఉత్తమమైన ఎంపిక కాదు. బిస్కెట్స్ తో కూడిన టీతో రోజు ప్రారంభించడానికి చెత్తగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిస్కెట్లు మైదా లేదా శుద్ది చేసిన పిండితో తయారు చేస్తారు. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచిది కాదు. వీటితో రోజును స్టార్ట్ చేస్తే అసిడిటీ, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, పోషకాహారం శోషణకు ఆటంకం కలుగుతుందని అంటున్నారు. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని డైటీషియన్స్ చెప్తున్నారు.
బిస్కెట్లు, టీలో కలిసి తీసుకోవడం వల్ల పేగు సమస్యలు కూడా పెరుగుతాయి. శుద్ది చేసిన చక్కెర కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. బిస్కెట్లలోని గోధుమ పిండి లేదా మైదాలో సంతృప్త కొవ్వుల సంఖ్య కారణంగా జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. వీటిలో ప్రిజర్వేటివ్, ఎమల్సిఫైయర్స్ వంటి అనారోగ్యకరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి చక్కెర, ఉప్పుతో కూడా లోడ్ చేయబడి ఉంటాయి. బిస్కెట్లతో కూడిన టీ తీసుకుంటే ఉబ్బరం కలిగించే అవకాశం ఉంది. ఇది రక్తపోటు, మధుమేహం, బరువు సంబంధిత సమస్యలని మరింత తీవ్రతరం చేస్తుంది. ఎక్కువ చక్కెర శక్తి తగ్గిపోయేలా చేస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఎలాంటివి ఎంచుకోవాలి?
⦿ బిస్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు ఫైబర్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాల పరిమాణాన్ని తనిఖీ చేసుకోవాలి. అందులో ఉపయోగించే పదార్థాలు ఏంటి, కొవ్వు శాతం ఎంత ఉంటుందనేది చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటేనే మంచిది.
⦿ బిస్కెట్స్ కి బదులుగా మఖానా, బాదం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి.
⦿ టీతో పాటు తీసుకునే బిస్కెట్ల సంఖ్యని పరిమితం చేసుకోవాలి. అతిగా తినకూడదు. ఎందుకంటే వాటిలోని చక్కెర, టీలోని చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇది హాని చేస్తుంది.
ఇవే కాదు వేయించిన లేదా జిడ్డు కలిగిన ఆహారాలు తీసుకుంటే బరువుగా అనిపిస్తాయి. ఇవి జీర్ణం కావడం కష్టం. పల్లీ పట్టి వంటి జిడ్డు కలిగిన ఆహారాలు టీతో పాటు తీసుకోకూడదు. దాని వల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ భారీ ఆహారాలతో జత చేయడం వల్ల ఈ ప్రయోజనం పొందలేకపోవచ్చు. సాధారణంగా తేలికైన, రుచికరమైన స్నాక్స్ తో ఎంచుకోవడం ఉత్తమం. ఫైబర్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కెఫీన్ శోషణని నెమ్మదింపజేయడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ పదార్థాలు బ్లెండర్‌లో అస్సలు వేయొద్దు