Top Headlines Today:


 


నేడు ఏపీ కేబినెట్‌ భేటీ


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం అప్పుడే కనిపిస్తోంది.  ముఖ్యమంత్రి జగన్  ముందస్తుకు సిద్దమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  తెలుగు దేశం  అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ ప్రభుత్వం పాలన పరమైన నిర్ణయాల్లో వేగం పెంచింది. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి  యాత్రకు సిద్దమయ్యారు. ఈ సమయంలో బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ ఈ కేబినెట్ భేటీ పై ఉత్కంఠ  ప్రారంభమయింది. 


 


ఐసీసీ వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్


పదేండ్ల తర్వాత  ఐసీసీ ట్రోఫీని అందుకోవాలనే తపన ఒకరిదైతే ప్రపంచ క్రికెట్‌పై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే పట్టుదల మరొకరిది.. ఈ నేపథ్యంలో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య నేటి నుంచి ఐసీసీ వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనుంది. తటస్థ వేదిక అయిన ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ‘కెన్నింగ్టన్ ఓవల్’ ఇందుకు సిద్ధమైంది.  బుధవారం నుంచి ఇండియా - ఆస్ట్రేలియా మధ్య  డబ్ల్యూటీసీ ఫైనల్‌ మొదలుకాబోతోంది. క్రికెట్‌ను అమితంగా అభిమానించే ఇంగ్లాండ్‌లో లార్డ్స్  తర్వాత ఓవల్ కూడా ప్రఖ్యాత  క్రికెట్  స్టేడియంగా విరాజిల్లుతోంది.  ఇక్కడ ఇప్పటివరకూ 104  మ్యాచ్‌లు జరుగుగా  టాస్ గెలిచిన జట్టు 88 సార్లు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 38 మ్యాచ్‌లు గెలుచుకుంది.  బౌలింగ్ ఫస్ట్ చేసిన  టీమ్ 16 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.    


 


నేటి నుంచి పట్టాలెక్కనున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌


ఒడిశాలో ప్రమాదానికి గురైన తర్వాత కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ మళ్లీ పట్టాలు ఎక్కబోతోంది. ఇవాల్టి నుంచి అధికారులు ఆ ట్రైన్‌ను పునఃప్రారంభించనున్నారు.  షాలిమార్ నుంచి నిర్ణీత సమయానికి బయల్దేర నుంది. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగర్ బజార్‌ సమీపంలో ప్రమాదం జరిగింది. మూడు రైళ్లు పట్టాలు తప్పడంతో 288 మందిమృతి చెందగా, 1200 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు


 


ఏపీ నుంచి హజ్‌ యాత్ర 


ఆంధ్రప్రదేశ్‌ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ యాత్ర నేటి నుంచి ప్రారంభంకానుంది. 170 మంది ఈ యాత్రకు వెళ్లబోతున్నారు. 


 


అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ భేటీ 


సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నియంత్రించడానికి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్టీల మద్దతును కేజ్రీవాల్ కూడగడుతున్నారు. కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 


 


నేడు ములుగు జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన 


ములుగు జిల్లాలో పర్యటించనున్న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోమ్ మంత్రి మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు. మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా సభ నిర్వహణపై అధికారులకు సూచనలు, సలహాలు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. 150 కోట్లతో అభివృద్ధి పనులు, 200 కోట్ల లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేయనున్నా కేటీఆర్. ములుగు జిల్లాలో ఆర్టీవో సేవలను నేటి నుండి ప్రారంభం కానున్నాయి.