Coromandel Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర దుర్ఘటన తనను కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు కెనడియన్లు అండగా ఉంటారని, మద్దతునిస్తారని ప్రకటించారు. ఈ మేరకు కెనడా ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు. 







తైవాన్ ప్రెసిడెంట్ ట్సాయి ఇంగ్ వెన్ కూడా ఒడిశా ప్రమాద ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రకులకు సంతాపం ప్రకటించారు. ఈ ఘోర దుర్ఘటనపై ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ, ప్రమాదం గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపొన్ ఆకాంక్షించారు. 


 










మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షలు పరిహారం


ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య క్షణక్షణం పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదస్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగతున్నాయి. కాగా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 


రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్న తమిళనాడు


ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తమిళనాడుకు చెందిన 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. గాయపడ్డ 50 మందికిపైగా క్షతగాత్రులను ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. రైలు ప్రమాదంపై సీఎం స్టాలిన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ. లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు.