Odisha Train Accident:


షాక్‌లో ప్రయాణికులు 


ఒడిశా ట్రైన్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కొందరు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. ఇంకొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అదృష్టవశాత్తూ కొంతమంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి షాక్‌లోనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. ఏం జరిగిందో మీడియాకి వివరిస్తున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న కార్మికులు ప్రమాదాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 


"నేను అప్పటి వరకూ పడుకుని ఉన్నా. టాయిలెట్‌ కోసం అని అప్పుడే లేచి బాత్‌రూమ్‌లోకి వెళ్లాను. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కోచ్‌ మొత్తం ఊగిపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. కోచ్‌ అదుపు తప్పి పడిపోతుందని నాకు తెలుస్తూనే ఉంది. మేం తేరుకునే లోపే ప్రమాదం జరిగింది. ఎలాగోలా కోచ్‌లో నుంచి బయటకు వచ్చాను."


- బాధితుడు 






ఈ ప్రమాదంలో కొందరు శరీరాలు ఛిద్రమైపోయాయి. చేతులు ఓ చోట, కాళ్లు మరో చోట..ఇలా ఎక్కడ పడితే అక్కడ శరీర భాగాలు తెగి పడ్డాయి. ఇది చూసి ఇంకా భయ భ్రాంతులకు గురయ్యారు ప్రయాణికులు. రెస్క్యూ టీమ్‌ ప్రస్తుతానికి వాటన్నింటినీ సేకరించి ఒక్క చోటకు చేర్చుతోంది. మృతదేహాలనూ తరలిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడ్డ ఓ బాధితుడు శరీరభాగాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండటాన్ని చూసి వణికిపోయినట్టు వివరించాడు. 


"ప్రమాదం జరిగినప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నాను. ఒక్కసారిగా నాపైన 10-15 మంది పడ్డారు. ఉలిక్కి పడి లేచాను. అప్పటికే కోచ్ పడిపోయింది. చాలా సేపటి వరకూ బయటకు రావడానికి దారి దొరకలేదు. ఎలాగోలా బయటకు వచ్చాను. వచ్చీ రాగానే అక్కడి దృశ్యాలు చూసి వణికిపోయాను. కాళ్లు, చేతులు..ఇలా శరీర భాగాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. కొంత మంది ముఖాలు పూర్తిగా ఛిద్రమైపోయాయి"


- బాధితుడు 


ఓ కోచ్‌లో ఒకే బ్యాచ్‌కి చెందిన 26 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. "ఇది మా అదృష్టం" అని ఎమోషనల్ అవుతున్నారు వాళ్లంతా. 


"S-2, S-3,S-4 కోచ్‌లలో మేమున్నాం. ఉన్నట్టుండి మాకు పెద్ద శబ్దం వినిపించింది. బోగీలు బోల్తా పడ్డాయి. క్షణాల్లోనే అంతా జరిగిపోయింది. అదృష్టవశాత్తూ మాకు ఏమీ కాలేదు. సురక్షితంగా బయటపడ్డాం"


- బాధితుడు