Naveen Patnaik: 



మోదీపై ప్రశంసలు..


ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ ప్రెసిడెంట్ నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో అవినీతిని తగ్గించడంలో సక్సెస్ అయ్యారంటూ కితాబునిచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మోదీ సర్కార్ పని తీరుని ప్రస్తావించారు. విదేశాంగ విధానంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారని మెచ్చుకున్నారు. అంతే కాదు. 10 కి 8 మార్కులు అంటూ రేటింగ్ కూడా ఇచ్చారు నవీన్ పట్నాయక్. 


"మోదీ ప్రభుత్వం అవినీతిని తగ్గించడంలో సక్సెస్ అయింది. అందుకే 10 కి 8 మార్కులు ఇస్తున్నాను. విదేశాంగ విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయి. వీటితో పాటు చాలా రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. బీజేపీ హయాంలో అవినీతి దాదాపు తగ్గిపోయింది"


- నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి


మహిళా రిజర్వేషన్ బిల్‌పైనా..


ఇదే కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్‌ గురించీ ప్రస్తావించారు నవీన్ పట్నాయక్. తమ పార్టీ మహిళల సాధికారత కోసం ఎప్పుడూ ముందుంటుందని, ఈ బిల్‌కి పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించారు. 


"మహిళా రిజర్వేషన్ బిల్‌ తీసుకురావడం కీలకమైన ముందడుగు. మహిళా సాధికారతను మేమెప్పుడూ గౌరవిస్తాం. మా నాన్న బిజూ పట్నాయక్ కూడా అప్పట్లోనే మహిళలకు మద్దతుగా నిలిచారు. స్థానిక ఎన్నికల్లో 33% మంది మహిళలకే టికెట్‌లు ఇచ్చారు. నేను ఇప్పుడు దాన్ని 50%కి పెంచాను. 2019 ఎన్నికల్లో లోక్‌సభ సీట్లలో 33%  మేర మహిళలకే కేటాయించాం:


- నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి


జమిలి ఎన్నికలకు సిద్ధమే..


దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే ఎన్నికపై చర్చ జరుగుతున్న క్రమంలోనే నవీన్ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా అవసరమని, అది ఒకవేళ అమల్లోకి వస్తే పూర్తి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 


"మాకు కేంద్రంతో సత్సంబంధాలే ఉన్నాయి. మా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవడం సహజమే అయినా కేంద్ర ప్రభుత్వంతోనూ మైత్రి కొనసాగించాలనుకోవడమూ ముఖ్యమే. రాజకీయాలకు మచ్చ తీసుకొచ్చే పనులు చేయొద్దు. ప్రజలకు సేవ చేయడానికి దీన్నో మార్గంలా వినియోగించుకోవాలి"


-  నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి


పుతిన్ కూడా ప్రశంసలు..


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలసీలను ప్రశంసించారు. పీఎం మోదీ చేస్తన్నది కరెక్ట్‌ అని, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడం చాలా మంచి పాలసీ అని అన్నారు. మంగళవారం రష్యాలోని వ్లాదివోస్తోక్‌ పట్టణంలో ఈస్ట్రన్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఎనిమిదవ సమావేశంలో పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు రష్యాలో తయారయ్యే కార్ల గురించి ప్రశ్నించగా.. ఆయన మోదీ చేపడుతున్న మేక్‌ ఇన్‌ ఇండియా పాలసీని ఉదాహరణగా తీసుకొని మాట్లాడారు. దేశీయంగా తయారుచేసిన ఆటోమొబైల్స్‌ వాడడం చాలా అవసరమని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ఇప్పటికే ఈ విషయంలో ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.భారత్‌-మిడిల్‌ ఈస్ట్‌ - యూరప్‌ కారిడార్‌పై పుతిన్‌ పాజిటివ్‌గా స్పందించారు. దాని వల్ల రష్యాకు వచ్చే నష్టమేమీ లేదని, ఇంకా లాభమే చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఎకనామిక్‌ కారిడార్‌ ఏర్పాటుపై యూరోపియన్‌ యూనియన్‌, సౌదీ అరేబియా, భారత్‌లతో కలవడం పట్ల అమెరికాకు వచ్చేదేమీ లేదని, రష్యాకే ఉపయోగమని పేర్కొన్నారు. 


Also Read: Chandrayaan-3: ఇస్రో నెక్ట్స్ ప్రయోగం ఇదే, సక్సెస్ అయితే చరిత్ర సృష్టించినట్లే !