Chandrayaan-3: చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలు విజయవంతం అవడంతో ఇస్రో మరో బృహత్తర ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా చంద్రుడిపై నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేలా ప్రయోగాలు చేయనుంది. చంద్రయాన్-3 అనేక విషయాలు కనుగొందని, ముఖ్యంగా హాప్ ప్రయోగం విజయవంతమైందని, ఇది భవిష్యత్తులో చంద్రుని మిషన్లకు ఆధారం అవుతుందని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. చంద్రునిపై ప్రయోగాలు చేసి, అంతరిక్ష నమూనాలను భూమికి తిరిగి తీసుకువచ్చేలా ఇస్రో కార్యక్రమాలను రూపొందిస్తుందని ఆయన చెప్పారు.


దీనికి కచ్చితమైన టైమ్‌ లైన్ లేదని, కానీ అంతరిక్షం నుంచి నమూనాలను తీసుకుని తిరిగి భూమి మీదకు వచ్చే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు అధికారి తెలిపారు. చంద్రయాన్ హాప్ ప్రయోగం ఇందుకు ఒక నమూనా మాత్రమే అన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు మరొక ఖగోళ వస్తువులను తిరిగి భూమికి తీసుకరాగల సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఈ తరహాలోనే భారత్ ప్రయోగం చేపట్టింది. దీని కోసం సెప్టెంబరు 3న విక్రమ్ ల్యాండర్ తన రాకెట్‌లను పేల్చి 40 సెం.మీ ఎత్తుకు ఎగిరి మళ్లీ ల్యాండ్ అయింది. 


విక్రమ్ ల్యాండర్ దాని మిషన్ లక్ష్యాలను పూర్తిగా అధిగమించింది. అంతే కాకుండా హాప్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. దానిలోని ఇంజన్లను మండించడం ద్వారా దాదాపు 40 సెం.మీ వరకు పైకి లేచింది. 30 - 40 సెం.మీ దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ 'కిక్-స్టార్ట్' నమూనా భవిష్యత్తులో మానవ సహిత మిషన్లకు ప్రోత్సాహం ఇస్తుందని ఇస్రో తెలిపింది. కిక్ స్టార్ట్ ప్రయోగం తరువాత ర్యాంప్, ChaSTE, ILSA విజయవంతంగా  తిరిగి అమర్చబడ్డాయని ఇస్రో పేర్కొంది. 


చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు


గత 14 రోజులుగా చంద్రుడి ఉపరితలంపై నిద్రాణ స్థితిలో (స్లీప్ మోడ్) చంద్రయాన్ 3లోని ల్యాండర్ విక్రమ్, ప్రగ్యాన్ రోవర్‌లను వేక్ అప్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. మళ్లీ గ్రౌండ్ స్టేషన్‌తో కమ్యూనికేషన్‌ని ఏర్పాటు చేయాలని సైంటిస్ట్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటిదాకా విక్రమ్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదని ఇస్రో అధికారులు తెలిపారు. వీటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేలా విక్రమ్, ప్రగ్యాన్‌ను స్లీప్ మోడ్ నుంచి వేక్ అప్ చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇస్రో అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ల్యాండర్, రోవర్ లు చంద్రుని దక్షిణ ధ్రువంలో 16 రోజుల పాటు స్లీప్ మోడ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన అక్కడ పగలు మొదలైంది. ఈ సమయంలో ల్యాండర్ ను, రోవర్ ను రీయాక్టివేట్ చేయాలని ఇస్రో ప్రణాళిక వేసింది. బుధవారం శివశక్తి పాయింట్ వద్ద సూర్యకాంతి రాకతో వాటిని తిరిగి కార్యాచరణలోకి తీసుకురావడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం చంద్రయాన్-3 దిగిన ప్రాంతంలో సూర్యోదయం జరిగిందని, బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి తాము ఎదురుచూస్తున్నామని ఇస్రో తెలిపింది. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లతో మళ్లీ కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ల్యాండర్, రోవర్ పనిచేయడానికి అవసరమైన వేడిని అందజేసే సూర్యోదయం అవసరమని ఇస్రో తెలిపింది.