Nutri Gardens Program: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కేంద్ర సర్కారు కొత్త కార్యక్రమాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సామాజిక ప్రయోజన పనులను మాత్రమే నిర్వహిస్తుండగా.. ఇకపై వ్యక్తిగత, కుటుంబ ప్రయోజన కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించనుంది. ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో కూరగాయల సాగుతో పాటు పౌష్టికాహారం అందించేందుకు పోషక వనాలు (న్యూట్రి గార్డెన్స్) పెంపకం చేపట్టేందుకు ముందుకు వచ్చింది. గ్రామాల్లో వ్యవసాయ పోషక వనాలు (అగ్రి న్యూట్రి గార్డెన్స్) ఏర్పాటు చేసేందుకు రైతులకు సైతం ఈ కొత్త కార్యక్రమం కింద సాయం అందించనుంది.


ప్రతి కుటుంబం తమ స్థలాల్లో, అలాగే ప్రతి రైతుల తమ భూమిలో కూరగాయలు, పండ్లు పెంచుకోవచ్చు. ఇలా పండించిన కూరగాయలను, పండ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అలాగే మొక్కల పెంపకానికి అవసరమైన ఎరువులు, సాంకేతిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర సర్కారు అందిస్తుంది. ఈ కొత్త కార్యక్రమంపై గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్రం ఆదేశించింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు సైతం న్యూట్రి గార్డెన్స్ పెంపకం, నిర్వహణపై అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. 


ఉపాధి హామీ పథకం గురించి..


కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2005 ఆగస్టు 25న తీసుకు వచ్చింది. ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులు అందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో కోరిన వారికి స్థానికంగానే 100 రోజుల పని కల్పించడమే ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం. దీన్ని 2006 ఫిబ్రవరి 2న దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ప్రారంభించారు. 2008లో దీన్ని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. దీని కింద గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి, కాల్వలు, చెరువులు, బావులు, నీటి వనరుల పునరుద్ధరణ, కరువు నివారణ చర్యలు, అడువుల పెంపకం, వరదల నియంత్రణ, రక్షణ పనులు చేపట్టడం లాంటి పనులు చేయిస్తారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీల భూముల్లో వ్యవసాయాభివృద్ధికి అనువైన పనులు చేపట్టి వాటిని సాగులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తారు. 


పారదర్శకత ఉండేలా చట్టం ఏర్పాటు


గ్రామీణ ప్రాంత ప్రజలు పని కల్పించాలని సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, సుమారు 5 కిలో మీటర్ల పరిధిలోనే ఉపాధి కల్పిస్తారు. జాబ్ కార్డు పొందిన 15 రోజుల్లోగా పని చూపించకపోతే ఈ చట్టం కింద నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. ఉపాధికి సంబంధించిన వేతనాలను నేరుగా సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. గ్రామ పంచాయతీల్లో అమలు చేసే పనుల్లో కాంట్రాక్టర్ల ప్రమేయం నిషేధిస్తూ చట్టం ఈ పథకంలో రక్షణలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి పనుల్లో పారదర్శకత, జవాబు దారీతనం కోసం నిర్వహణను నోడల్ ఏజెన్సీలకు విధులు బదలాయించారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఖర్చు చేసిన నిధులపై సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. దీంతో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial