PM Modi :    ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత నాయకత్వానికి గుర్తింపుగా, పౌరుల్లో దేశభక్తిని పెంపొందించినందుకు గాను ఆగస్టు 1న పూణేలో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నారు.   "తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) లోకమాన్య తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ అవార్డునుప్రకటించింది.   ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ ప్రకటించారు.  


ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్‌లో ప్రధానమంత్రి అత్యున్నత నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన  ప్రగతి సాధించిందని "తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) ప్రశంసించింది.  పౌరులలో దేశభక్తి భావనను మేల్కొలిపి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచారు. ఆయన పట్టుదల, కృషి, ఆయన కృషికి ప్రాధాన్యతనిస్తూ తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్తలు ఆయనను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేశామని తెలిపింది.                        


ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆహ్వానించారు. ఆయన కూడా హాజరవ్వాలని నిర్ణయించారు. ఇతర ఆహ్వానితులలో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్ మరియు అజిత్ పవార్ ఉన్నారు. ఈ ఆహ్వానితుల జాబితా కూడా ఆసక్తికరంగా మారింది. 


ఎన్సీపీలో చీలిక తెచ్చి  మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ షిండే) ప్రభుత్వంలో చేరిన శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ‘మహా’ రాజకీయాలను ఓ కుదుపు కుదిపారు. త్వరలోనే  వీరిద్దరూ కిలిస తిలక్ అవార్డు ప్రదానోత్సవ వేడుకలో పాల్గొనుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వేదిక పంచుకోబోతున్నారు.  ఎన్సీపీకి అజిత్ గుడ్‌బై చెప్పిన తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించనుండడం అదే తొలిసారి అవుతుంది.                         


మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు పూర్తిగా బీజేపీ కనుసన్నల్లో జరిగాయని శరద్ పవార్ ఆరోపిస్తున్నారు. అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని అంటున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రధాని మోదీకి అవార్డు బహుకరణ వేడుకకు.. శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యేందుకు అంగీకరించడం .. రాజకీయంగా పెను సంచలనం అయ్యే అవకాశం ఉంది. పార్టీని కాపాడుకునేందుకు శరద్ పవార్ కూడా బీజేపీతో చేతులు కలుపుతారన్న  ప్రచారం ఓ వైపు జరుగుతున్న సమయంలో.. ఈ అవార్డు ప్రధానోత్సవ వేడుక హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. శరద్ పవార్ ఎప్పుడు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం. అందుకే ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుక.. తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు మరింత మారే అవకాశం ఉంది.