మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. యూజర్లు ఈజీగా వాట్సాప్ సేవలను అందుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కొత్త ఫీచర్లు అమల్లోకి తీసుకొచ్చిన వాట్సాప్, త్వరలో మరో చక్కటి ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేయబోతోంది.


ఇకపై ఫోన్ నెంబర్ తో వెబ్ కి లాగిన్ కావచ్చు!


ఇప్పటి వరకు వెబ్ వాట్సాప్ వినియోగించాలంటే కచ్చితంగా వాట్సాప్ వాడుతున్న మొబైల్ నుంచి QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాతే వెబ్ లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఫోన్ లో కెమెరా  పని చేయకపోయినా, పగిలిపోయినా వెబ్ లాగిన్ చేయడం కష్టం అవుతుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తోంది వాట్సాప్. QR కోడ్ స్కాన్ అవసరం లేకుండా నేరుగా వాట్సాప్ కు వినియోగిస్తున్న ఫోన్ నెంబర్ ఆధారంగా లాగిన్ అయ్యేలా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై మెటా యాజమాన్యం పరీక్షలు జరుపుతోంది.   


కొత్త ఫీచర్ పై కొనసాగుతున్న పరీక్షలు


ఫోన్ నెంబర్ ద్వారా వెబ్ లాగిన్ అయ్యే ఫీచర్ మీద వాట్సాప్ పరీక్షలు జరుపుతోంది. ఈ ఫీచర్ ను ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లతో పరీక్షించబడుతోంది. వాట్సాప్ వెబ్‌లో ఫోన్ నంబర్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ ఖాతాలను లాగిన్ అయ్యే సామర్థ్యాన్నిపరీక్షిస్తోంది. WABetaInfo ప్రకారం, వాట్సాప్ లో ఎగువ కుడి మూలలో ఓవర్‌ ఫ్లో (మూడు చుక్కలు) బటన్‌ను నొక్కడం ద్వారా 'పరికరాన్ని లింక్ చేయండి' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా  QR కోడ్, బయోమెట్రిక్ రీడర్ తో వెబ్ లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, కొత్త బీటాలో, 'లింక్ విత్ ఫోన్ నెంబర్' అనే మరో ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురానుంది.  దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీ డెస్క్‌ టాప్‌లో WhatsApp వెబ్‌ని తెరవమని చెప్పడంతో పాటు స్మార్ట్‌ ఫోన్‌ లో ప్రదర్శించబడే 8-అంకెల కోడ్‌ను ఎంటర్  నమోదు చేయమని అడుగుతుంది. నెంబర్ ను ఎంటర్ చేయడం పూర్తయిన తర్వాత, మీరు WhatsApp వెబ్‌కు లాగిన్ చేసుకునే అవకాశం ఉంటుంది.  






అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!


ఒకప్పుడు ఫోన్ నెంబర్ ద్వారా వెబ్ లాగిన్ మంచిది కాదని వాట్సాప్ ప్రకటించింది. కానీ, ఇప్పుడు ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వెబ్ లాగిన్ కు ఫోన్ నంబర్‌కు బదులుగా QR కోడ్‌ను ఎందుకు ఉపయోగించాలో గతంలో వాట్సాప్ వెల్లడించింది.  స్కాన్ చేయడం వల్ల  భద్రతో పాటు ఈజీగా లాగిన్ అయ్యే అవకాశం  ఉంటుందని తెలిపింది. వినియోగదారుల మెసేజ్ లతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారానికి అనధికారిక యాక్సెస్‌ను నిరోధించడంలో సహాయపడుతుందని వివరించింది.  QR కోడ్‌ని ఉపయోగించడం ద్వారా, WhatsApp యూజర్‌లు యూజర్‌నేమ్,  పాస్‌ వర్డ్‌ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా వెబ్ క్లయింట్‌కి లాగిన్ అవ్వడాన్ని సులభతరం చేస్తుందని చెప్పింది. అయితే, ఈ విధానం ద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఫోన్ నెంబర్ ద్వారా వెబ్ లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పించాలని వాట్సాప్ నిర్ణయించింది.  


Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial