First Skin Bank: ఉత్తర భారతదేశంలో తొలిసారిగా స్కిన్ బ్యాంక్ ను ఏర్పాటు చేశారు. మంగళవారం దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఈ స్కిన్ బ్యాంక్ ను ప్రారంభించారు. మంటల్లో చర్మం కాలి పోయిన వారికి, యాసిడ్ దాడులకు గురైన వారికి ఈ స్కిన్ బ్యాంక్ లోని చర్మాన్ని అందిస్తారు. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి ఉత్తర భారతదేశంలో చర్మ దానం పనులు ప్రారంభించిన మొదటి ఆస్పత్రిగా నిలిచింది. ఈ బ్యాంకులో అందుబాటులోకి వచ్చే చర్మం.. వివిధ పరిస్థితుల వల్ల చర్మం కోల్పోయిన రోగుల్లో స్కిన్ గ్రాఫ్టింగ్ లో సహాయపడుతుంది. ఇప్పటి వరకు దేశంలో 16 స్కిన్ బ్యాంకులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఏడు, చెన్నైలో నాలుగు, కర్ణాటకలో మూడు, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కొక్కటి చొప్పున స్కిన్ బ్యాంకులు ఉన్నాయి. మరణించిన వ్యక్తి నుంచి 6 గంటల్లోపు చర్మాన్ని దానం చేయవచ్చు.
ఉత్తర భారత్ లోని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు స్కిన్ బ్యాంక్ లేదు. ఇప్పుడు ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్ వల్ల కాలిన గాయాలై వారు, యాసిడ్ దాడులకు గురైన వారు, ఇతర ప్రమాదాల్లో చర్మం కోల్పోయిన వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బర్న్స్ అండ్ ప్లాస్టిక్స్ విభాగాధిపతి డాక్టర్ శలభ్ కుమార్ తెలిపారు. ఇన్ని రోజులు చాలా మంది బాధితులు తమ వద్దకు వచ్చి చర్మ దాతల కోసం అడిగే వారని చెప్పుకొచ్చారు.
బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదు
శరీరంలోని ఇతర భాగాలు మార్పిడి చేయాల్సి వస్తే ఒకే బ్లడ్ గ్రూపు కావాల్సి ఉంటుంది. స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదు. అలాగే స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత ఇమ్యూనోసప్రెషన్ మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా చర్మాన్ని దానం చేయవచ్చు. అలాగే ఎవరికైనా ఆ చర్మాన్ని వర్తించవచ్చు. ఆర్బో బ్యాంక్ ఆఫ్ ఎయిమ్స్ దేశంలో అవయవ దానంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అయితే చర్మ దానం విషయంలో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి కొత్త చరిత్రను సృష్టించింది.
అగ్ని ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో, యాసిడ్ దాడి జరిగినప్పుడు చర్మ దానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భారత్ లో ప్రతి సంవత్సరం 80 లక్షల మందికి పైగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు, రెండో స్కిన్ బర్న్ కారణంగా 10-15 శాతం మందికి తీవ్రమైన చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇది ప్రాణాంతకమని వైద్యులు చెబుతున్నారు.
చర్మ దానం ఎందుకు అవసరమంటే..
శరీరాన్ని, శరీరంలోని అవయవాలను చర్మం రక్షిస్తుంది. ఇది సహజ రక్షణ కల్పిస్తుంది. సూర్యరశ్మి, కాలుష్యం, రసాయనాలు, బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని చర్మమే రక్షిస్తుంది. చిన్న పాటి గాయాలు అయినా తనకు తానే నయం అవుతుంది. అయితే తీవ్రమైన గాయాలు అయినప్పుడు చర్మం తిరిగి సాధారణ స్థితికి రాలేదు. అలాంటి సమయంలో ఇతరుల చర్మం గాయాలు అయిన చోట్ల అతికించడం వల్ల పూర్వపు రూపు వస్తుంది. శరీరానికి రక్షణ కూడా లభిస్తుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial