Delhi Hotel:
ఢిల్లీలోని హోటల్‌కి షాక్..
ఫైవ్ స్టార్ హోటల్‌కి వెళ్లి ఒక రోజంతా ఉండి బిల్ కట్టకుండా తప్పించుకుని రాగలరా..? కష్టమే అనుకుంటున్నారు కదా. కానీ...ఆ వ్యక్తికి మాత్రం ఇదేమంత కష్టం కాదు. ఒక్కరోజేంటి..? ఏకంగా రెండేళ్ల పాటు అదే హోటల్‌లో ఉండి మరీ సింపుల్‌గా తప్పించుకుని పారిపోయాడు. రూ.58 లక్షల బిల్‌ని ఎగవేసి వెళ్లిపోయాడు. ఒక్క పైసా కట్టకుండా రెండేళ్లుగా అదే హోటల్‌లో ఉంటున్నాడు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలో ఉన్న 5 స్టార్ హోటల్‌లో జరిగిందీ ఘటన. ఆ వ్యక్తి వెళ్లిపోయాక కానీ...హోటల్ యాజమాన్యానికి అసలు విషయం అర్థం కాలేదు. తాము మోసపోయామని గ్రహించి...వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది హోటల్ సిబ్బంది. హోటల్ యజమాని వినోద్ మల్హోత్రా కంప్లెయింట్ ఇచ్చాడు. తమ హోటల్‌లో 603 రోజుల పాటు ఉన్న అంకుశ్ దత్త (Ankush Dutta)రూ.58 లక్షల బిల్ ఎగ్గొట్టి పారిపోయాడని చెప్పాడు. హోటల్ ఫ్రంట్ ఆఫీస్ హెడ్ ప్రేమ్ ప్రకాశ్...నిందితుడికి సహకరించినట్టు ఆరోపించాడు. హోటల్‌లో ఎవరెవరు స్టే చేస్తున్నారు..? ఎవరెవరికి యాక్సెస్ ఉంది అనేది పూర్తిగా ప్రేమ్ ప్రకాశ్ చేతుల్లోనే ఉందని, అతని సహకారం లేకుండా నిందితుడు అన్ని రోజులు హోటల్‌లో ఉండే అవకాశమే లేదని చెబుతున్నాడు హోటల్ ఓనర్. ఓవర్‌స్టే చేసేందుకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నాడు. హోటల్ సాఫ్ట్‌వేర్‌ని కూడా మేనిప్యులేట్ చేసి ఈ నేరానికి పాల్పడ్డారని చెబుతున్నాడు మల్హోత్రా.
ఫైల్స్ డిలీట్..
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే...సిస్టమ్‌లో చాలా ఫైల్స్‌ని డిలీట్ చేశారు. కొన్ని కొత్త అకౌంట్స్ యాడ్ చేశారు. ఎంట్రీస్ విషయంలోనూ అవతకవకలు జరిగాయి. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు ఓనర్. ప్రాథమిక వివరాల ప్రకారం...నిందితుడు అంకుశ్ దత్త 2019 మే 30వ తేదీన హోటల్‌లో ఫస్ట్‌టైమ్ చెకిన్ చేశాడు. వన్ నైట్‌కి మాత్రమే బుకింగ్ చేశాడు. మే 31వ తేదీన చెకౌట్ చేయాల్సి ఉన్నా...అప్పటి నుంచి ఎక్స్‌టెండ్ చేస్తూ వచ్చాడు. 2021 జనవరి 22 వరకూ అక్కడే ఉన్నాడు. నిజానికి..హోటల్‌కి ఎవరు వచ్చినా 72 గంటల్లో బిల్ క్లియర్ చేయకపోతే...వెంటనే ఆ మ్యాటర్ సీఈవో వరకూ వెళ్తుంది. అయితే..ఫ్రంట్ ఆఫీస్ హెడ్ మాత్రం ఇది ఎవరి దృష్టికీ వెళ్లకుండా మేనేజ్ చేశాడు. చివరకు ఇద్దరూ అడ్డంగా బుక్ అయ్యారు. మరో ట్విస్ట్ ఏంటంటే...నిందితుడు దత్త హోటల్‌కి మొత్తం మూడు చెక్స్ ఇచ్చాడు. రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షల చెక్‌లు ఇచ్చాడు. ఇవన్నీ బౌన్స్ అయ్యాయి. ఆ విషయం కూడా పై అధికారుల దృష్టికి వెళ్లలేదు. ఈ ఇద్దరి నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. చీటింగ్ కేసు పెట్టాలని చెబుతున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులెవరో గుర్తించామని, విచారణ పూర్తైన తరవాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. హోటల్ రికార్డ్‌లనూ పరిశీలిస్తామని చెప్పారు.
Also Read: International Yoga Day: నెహ్రూ ఫొటోతో యోగా డే విషెస్ చెప్పిన కాంగ్రెస్, ఆయనే పాపులర్ చేశారని ట్వీట్