No Toll Tax Within 60 km:  జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న అన్ని టోల్ ప్లాజాల(Toll Plaza)ను వచ్చే మూడు నెలల్లో తొలగిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రకటించారు. “60 కి.మీ దూరం లోపు ఒకే ఒక్క టోల్ ప్లాజా ఉంటుంది,” అని లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రోడ్లు, హైవేల(Highways)కు బడ్జెట్ కేటాయింపులపై చర్చలో సమాధానమిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. హైవేలపై 60 కి.మీ దూరంలో రెండు టోల్(Toll) ప్లాజాలు ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, జాతీయ రహదారులపై రెండు టోల్ ప్లాజాల మధ్య కనీసం 60 కి.మీ గ్యాప్ ఉండేలా చూస్తామని మంత్రి తెలిపారు.


టోల్ ప్లాజా వద్ద స్థానికులకు ఉచిత పాస్ లు 


టోల్ ప్లాజాల సమీపంలోని స్థానికులకు హైవేలపై సజావుగా వెళ్లేందుకు ఆధార్ కార్డ్(Aadhaar Card) చిరునామా ఆధారంగా ప్రభుత్వం ఉచిత పాస్‌లను జారీ చేస్తుందని గడ్కరీ చెప్పారు. ఈ నిబంధన ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులు అడ్రస్ ప్రూఫ్‌తో సహా అవసరమైన పత్రాలతో దరఖాస్తుల సమర్పిస్తే టోల్ పన్ను చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చని తెలిపారు. ఆధార్ కార్డును అడ్రస్ ప్రూఫ్‌గా పరిగణిస్తామని, స్థానికులకు ఉచిత పాస్‌లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. 8 మంది వరకు ప్రయాణించే మోటారు వాహనాల్లో ప్రయాణికుల భద్రతను పెంచేందుకు ప్రభుత్వం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసిందని మంత్రి తెలిపారు.


దిల్లీలో రూ.62 వేల కోట్లతో రోడ్డు ప్రాజెక్టులు 


సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్‌లో పురోగతితో ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్‌తో నడిచే వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తామని మంత్రి అన్నారు. రవాణా కోసం హైడ్రోజన్ టెక్నాలజీని ఉపయోగించాలని ఎంపీలను కోరిన గడ్కరీ, మురుగు నీటిని గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి తమ జిల్లాల్లో చొరవ తీసుకోవాలని కోరారు. హైడ్రోజన్(Hydrogen)  చౌకైన ఇంధన ప్రత్యామ్నాయం అని ఆయన చెప్పారు. "గరిష్టంగా రెండేళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్, కారు, ఆటోరిక్సా ధర పెట్రోల్‌తో నడిచే స్కూటర్, కారు, ఆటోరిక్షా ధరలకు సమానంగా ఉంటుందని నేను చెప్పగలను. లిథియం-అయాన్ బ్యాటరీ(Lithium Ion Battery) ధరలు తగ్గుతున్నాయి.  అల్యూమినియం-అయాన్, సోడియం-అయాన్ బ్యాటరీల్లో జింక్-అయాన్ కెమిస్ట్రీని అభివృద్ధి చేస్తున్నాం. మీరు పెట్రోల్ వాహనంపై రూ. 100 ఖర్చుపెడితే, ఎలక్ట్రిక్ వాహనంపై రూ. 10 ఖర్చు అవుతుంది." అని గడ్కరీ చెప్పారు. దిల్లీలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు, కాలుష్య సమస్యను అధిగమించేందుకు రూ.62,000 కోట్లతో రోడ్డు ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి తెలిపారు.