విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ.. ఈ ముగ్గురు భారత్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు చెక్కేసిన వ్యక్తులు. బ్యాంకులకు వేల కోట్లు పంగనామాలు పెట్టిన వీళ్ల దగ్గర నుంచి ప్రభుత్వం ఎంత వసూలు చేసిందో తెలుసా? ఈ ముగ్గురికి చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
ఎలా అంటే?
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తమ సంస్థల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసగించారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ముగ్గురూ రూ.22,585.83 కోట్ల మేరకు బ్యాంకులను మోసగించారని తెలిపారు.
బ్యాంకులకు తిరిగి
ఈ ముగ్గురూ మోసగించిన ఆస్తుల్లో 84.61 శాతం ఆస్తులను 2022 మార్చి 15 వరకు జప్తు చేసుకున్నట్లు చెప్పారు. బ్యాంకులకు జరిగిన నష్టంలో 66.91 శాతం విలువైన ఆస్తులను తిరిగి బ్యాంకులకు, భారత ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం వీరి నుంచి 2022 మార్చి 15 వరకు రూ.19,111.20 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల నుంచి రూ.15,113.91 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు తిరిగి అప్పగించినట్లు తెలిపారు. రూ.335.06 కోట్ల విలువైన ఆస్తులను భారత ప్రభుత్వానికి స్వాధీనం చేసినట్లు చెప్పారు.
భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియంకు అప్పగించిన ఆస్తుల అమ్మకం ద్వారా రూ.7,975.27 కోట్లు వచ్చిందన్నారు. ఈ ఆస్తులను ఈ కన్సార్షియంకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అప్పగించినట్లు తెలిపారు.
ఆ చట్టం ప్రకారం
మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002; ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్, 2018 ప్రకారం మనీలాండరింగ్‌లో చిక్కుకున్న ఆస్తులను రుణాలిచ్చిన బ్యాంకులు సహా చట్టబద్ధమైన మూడో పక్షానికి అప్పగించే అధికారం న్యాయస్థానానికి ఉంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల కేసులకు కూడా ఈ చట్టాలు వర్తిస్తున్నాయి.
ఈ ముగ్గురిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యల్ని కూడా కేంద్రం చేపట్టినట్లు పంకజ్ గుర్తుచేశారు. త్వరలోనే వీరికి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
Also Read: Money Laundering Case: మొన్న మేనల్లుడు, నేడు బావమరిది- సీఎంలు మారారంతే, సీనంతా సేమ్ టూ సేమ్