Tomato Price: 


కిలో రూ.250


టమాటా ధరల రేపోమాపో తగ్గుతాయన్న ఆశలు కూడా గల్లంతవుతున్నాయి. రోజురోజుకీ పెరగడమే తప్ప తగ్గే జాడే కనిపించడం లేదు. రూ.150 వరకూ ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు రిటైల్‌లో ఏకంగా రూ.250కి పెరిగింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కిలో టమాటాలు రూ.250కి విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇదే రికార్డు. చాలా చోట్ల భారీ వర్షాలు కురిసి పంట నష్టం వాటిల్లింది. ఫలితంగా...డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై జరగడం లేదు. మార్కెట్‌లో సరుకు తక్కువయ్యే కొద్ది రేట్‌లు పరుగులు పెడుతున్నాయి. కోల్‌కత్తాలోని రిటైల్ మార్కెట్‌లలో కిలో టమాటా ధర రూ.152గా ఉంది. ఢిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117,ముంబయిలో రూ.108గా నమోదైంది. దేశవ్యాప్తంగా యావరేజ్‌గా చూసుకుంటే కిలో టమాటా ధర రూ.95.58గా ఉంది. ఇవి గురువారం (జులై 6) నాటి లెక్కలు. ఉత్తరాఖండ్‌ తరవాత...అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో కిలో టమాటా రూ.162 పలుకుతోంది. అత్యంత తక్కువ ధర ఉంది ఒక్క రాజస్థాన్‌లోనే. అక్కడి చురు జిల్లాలో కిలో టమాటా కేవలం రూ.31కే విక్రయిస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గుడ్‌గావ్‌లో రిటైల్ ప్రైస్ రూ.140, బెంగళూరులో రూ.110,వారణాసిలో రూ.107, హైదరాబాద్‌లో రూ.98, భోపాల్‌లో రూ.90కి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఏటా జులై-ఆగస్టు మధ్య కాలంలో టమాటా ధరలు పెరుగుతుంటాయి. సరిగ్గా అదే సమయానికి వర్షాలు భారీగా కురవడం, పంట నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే...సప్లైపై ప్రభావం పడుతుంది. కానీ...ఈ సారి ఈ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంది. అందుకే...ఇంతలా ధరలు పెరిగిపోయాయి.




ఇప్పట్లో తగ్గనట్టేనా..? 


ఆహార పదార్థాల ఒత్తిడి ఇప్పట్లో తొలగిపోయేలా లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలూ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పట్లో ధరాభారం నుంచి సామాన్యులకు ఉపశమనం దొరకదని తెలిసింది. దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు వారం రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వేసవి కాలంలో వేడిగాలులు, వర్షాలు సకాలంలో రాకపోవడంతోనే కూరగాయాల దిగుబడి తగ్గిన సంగతి తెలిసిందే. కాగా ఎల్‌నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక ఆర్థిక సమీక్ష పేర్కొంది. పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది.వర్షాల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం కల్గడంతో మెట్రో నగరాల్లో టమాటా ధరలు మరింత అధికం అయ్యాయి. 


టమాటా దొంగలు..


కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతు టమాటా పండించింది. ధరలు పెరగడం వల్ల మంచి ఆదాయం వస్తుందని సంబర పడింది. పంటకోసి మార్కెట్‌కి తీసుకెళ్దామని చూసే లోపు ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దుండగులు. టమాటా సాగు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని, వాటిని ఎలా కట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. 2 ఎకరాల్లో పంట సాగు చేసింది మహిళా రైతు. సరిగ్గా పంట కోతకు వచ్చే సమయానికే ఒక్క కాయ కూడా లేకుండా దొంగలు అంతా ఊడ్చేశారు. 


Also Read: పరువు నష్టం దావా కేసులో రాహుల్‌కి నో రిలీఫ్ ,స్టే పిటిషన్‌ని కొట్టేసిన గుజరాత్ హైకోర్టు