Rahul Gandhi Defamation Case Verdict: 


పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్‌కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేయగా...దాన్ని గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై ఓ బీజేపీ ఎంపీ సూరత్ కోర్టుని ఆశ్రయించారు. రాహుల్‌పై పరువు నష్టం దావా కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు..ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ని దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అప్పటి నుంచి రాహుల్ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే...సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ...కోర్టు మాత్రం ఆ పిటిషన్‌ని నిరాకరించింది. జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్‌తో కూడిన సింగిల్ బెంచ్ దీన్ని కొట్టివేసింది. ఇదే కేసులో లోక్‌సభ సభ్యత్వమూ కోల్పోయారు రాహుల్. అప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. చెప్పాలంటే...విపక్షాలన్నీ ఒక్కటైంది కూడా అప్పుడే. రాహుల్‌పై అనర్హత వేటు వేయడాన్ని...కాంగ్రెస్‌తో విభేదాలున్న పార్టీలూ వ్యతిరేకించాయి. ఇదంతా కేవలం కుట్రపూరితంగా చేసిందే అని కాంగ్రెస్ గట్టిగానే వాదిస్తోంది.