గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంతో పాటు అతని అత్యంత సన్నిహితులైన చోటా షకీల్ సహా ముగ్గురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జిషీటును ఫైల్ చేసింది. ముంబయిలో పేలుళ్లు సహా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిందనే ఆరోపణల కేసులో ఈ ఛార్జిషీటును ముంబయి కోర్టులో దాఖలు చేసినట్లుగా ఎన్ఐఏ శనివారం (నవంబరు 5) ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి ప్రకటించిన గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, షకీల్‌తో పాటు (ఇద్దరూ పాకిస్థాన్‌లో దాక్కున్నారు) ఇటీవల ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మరో ముగ్గురు వారి అనుచరులు ఆరిఫ్ అబూబకర్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్, షబ్బీర్ అబూబకర్ షేక్, మహ్మద్ సలీం ఖురేషీ అలియాస్ సలీం ఫ్రూట్ అని ఛార్జిషీటులో పేర్కొన్నారు.
“డి-కంపెనీ, ఉగ్రవాద ముఠా, క్రైమ్ సిండికేట్‌లో పని చేసిన నిందితులు వివిధ రకాల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఆ గ్రూపు యొక్క నేర కార్యకలాపాలను మరింత పెంచడానికి కుట్ర పన్నారని విచారణలో ధ్రువీకరించారు. ఆ కుట్రలో భాగంగా దావూద్ ఇబ్రహీం ప్రయోజనం కోసం బెదిరించి, కొంత మంది బాధితులకు ప్రాణభయం చూపించి లేదా బాధపెట్టి భారీ మొత్తంలో డబ్బు సేకరించారు. ఇంకా దోపిడీలు కూడా చేశారు. వీరు భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశంతో పాటు సాధారణ ప్రజలల్లో భయోత్పాతాన్ని సృష్టించే ఉద్దేశంతో వారు అనేక నేరాలకు పాల్పడ్డారు.”అని NIA ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
డీ కంపెనీపై ఎఫ్ఐఆర్
ఈ ఏడాది ముంబయిలో డీ కంపెనీపై ఎన్‌ఐఎ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత దావూద్ అనుచరులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేయగా, అతడి ముఠాకు సంబంధించిన పలు కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఈ ఛార్జిషీట్‌ను తాజాగా ముంబయి కోర్టులో దాఖలు చేశారు.
దేశంలో యాక్టివ్‌గానే దావూద్ నెట్‌వర్క్!
దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ సహా పలు దేశాల్లో రహస్య స్థావరాలు ఉన్నాయి. భారత్‌లో అనేక ఉగ్రవాద ఘటనలకు పాల్పడ్డాడు. అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. కానీ అతను పరారీలో ఉంటూ పాకిస్థాన్ లో తలదాచుకున్నాడు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ దేశంలో చురుగ్గా ఉన్నట్లు ఆధారాలు లభించాయని, దీనికి సంబంధించిన కుట్రలను నిఘా సంస్థలు నిరంతరం భగ్నం చేస్తూనే ఉన్నాయి.
దావూద్‌పై భారీ పారితోషికం
భారతదేశంలో 1993 ముంబయి వరుస పేలుళ్లతో సహా అనేక ఉగ్రవాద కార్యకలాపాలు, పేలుళ్లతో దేశాన్నే గడగడలాడించిన దావూద్ ఇబ్రహీంపై 2003లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ భారీ పారితోషికాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా దావుద్ ఇబ్రహీం తలపై $ 25 మిలియన్ల బహుమతి ఉంది. అతను లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, జైష్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, హిజ్బుల్ ముజాహిదీన్ బాస్ సయ్యద్ సలావుద్దీన్, జైష్ నంబర్ 2 అబ్దుల్ రవూఫ్ అస్గర్‌లతో పాటు భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లేదా టెర్రరిస్టులలో ఒకడిగా ఉన్నాడు.