NIA: దేశంలో షరియా చట్టం అమలుకు కుట్ర పన్నిన హిజ్బుత్‌ తహ్రీర్‌ కేసులో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 17 మందిని నిందితులుగా చార్జిషీట్‌లో పే‌‌ర్కొన్నారు. అమాయక ముస్లిం యువకులకు వల వేసి, వారిని ఆకర్షించి ఇస్లామిక్‌ రాడికల్స్‌గా మారుస్తున్నట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ పోలీసులు భోపాల్‌కు చెందిన యాసిర్‌ను అరెస్టు చేయడంతో ఈ కుట్ర బయటపడిందిన్నారు. మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ పోలీసులు మే నెలలో భోపాల్‌తో పాటు హైదరాబాద్‌లో దాడులు నిర్వహించారు. 


ఈ దాడుల్లో మొత్తం 17 మంది అనుమానితులను గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో కేంద్ర విచారణ సంస్థలకు సంచలన విషయాలు తెలిశాయి. యువకులను ఇస్లామిక్‌ రాడికల్స్‌గా మార్చేందుకు తుపాకీ  కాల్చడంలో శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. అంతే కాదు ఆయుధాలతో దాడులు చేయడంపై రహస్య ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఏటీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు యాసిర్‌తో పాటు మరికొందరు హైదరాబాద్‌ వచ్చి యువతతో సమావేశం ఏర్పాటు చేసి ఉగ్రవాదంవైపు మళ్లించేలా ప్రేరేపించినట్టు గుర్తించారు.


పోలీసులతో పాటు ఓ వర్గానికి చెందిన నేతలపైనా దాడులు చేసేందుకు యాసిర్, ఉగ్ర సంస్థలు కుట్రపన్నినట్టు విచారణ అధికారులు తేల్చారు. భోపాల్‌కు చెందిన 11 మందితో పాటు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మహ్మద్‌ సలీం, అబ్దుల్‌ రహమాన్‌, మహ్మద్‌ అబ్బాస్‌, షేక్‌ జునేద్‌, హమీద్‌, సల్మాన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేశ సమగ్రత, భద్రత, ఐక్యత దెబ్బతీసేందుకు హిజ్బుత్ తహ్రీర్ కు చెందిన ఇస్లామిక్ రాడికల్స్ కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.


హైదరాబాద్ మహానగరంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో మధ్య ప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) మే నెలలో 16 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిలో భోపాల్‌కు చెందిన 11 మంది ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. ఒక కేసులో భాగంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి మధ్యప్రదేశ్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారి వద్ద నుంచి జిహాదీ మెటీరియల్‌, కత్తులు, ఎయిర్‌గన్స్ స్వాధీనం చేసుకున్నారు. 


18 నెలలుగా రాడికల్ ఇష్లామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. అంతే కాకుండా పలువురు ప్రముఖలపై నిఘా ఉంచినట్లు నిర్ధారించారు. అంతే కాకుండా నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లుగా సమాచారం ఉంది. వారికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ కేసుల వివరాలతో పాటు వీరితో సంబంధం ఉన్న వారి గురించి ఆరా తీశారు. అదుపులోకి తీసుకున్న వారిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఏటీఎస్ ఇచ్చిన సమాచారంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దర్యాప్తులో అధికారులకు సంచలన తెలిశాయి. దీనిపై చార్జిషీట్ దాఖలు చేశారు.