Bharatiya Nagarik Suraksha Sanhita And Bharatiya Sakshya Adhiniyam: కాలం చెల్లిన బ్రిటిషన్ వలస పాలన చట్టాలను వదిలి నేటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. త్వరలోనే భారత శిక్షా స్మృతి, నేర శిక్షాస్మృతి, సాక్షాధార చట్టాలను కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో భారత పార్లమెంట్ ఆమోదించిన  భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్  సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌ చట్టాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి....

 

పాత చట్టాలకు కాలం చెల్లు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా...ఇప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం వాసనలు ఇంకా పోలేదు. దేశంలో ఇప్పటికీ బ్రిటీష్‌వారు రూపొందించిన చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ చట్టాలను రూపొందించారు. వలస పాలన నుంచి విముక్తి లభించినా...ఇప్పటికీ భారతీయులకు ఈ చట్టాల నుంచి విముక్తి లభించలేదు. వీటికి చరమగీతం పాడేందుకు గత ప్రభుత్వం హయాంలో మోడీ(MODI) సర్కార్ కొత్తచట్టాలను రూపొందించగా....పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పటిక వరకు కొనసాగుతున్న  ఐపీసీ( I.P.C), సీఆర్‌పీసీ( C.R.P.C), భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగుకానున్నాయి. వాటి స్థానంలో పార్లమెంట్ ఆమోదించిన బీఎన్‌ఎస్‌(B.N.S.),బీఎన్‌ఎస్‌ఎస్‌(B.N.S.S),బీఎస్‌ఏ(B.S.A) చట్టాలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు, ఎస్‌ఎమ్మెఎస్‌(SMS) ద్వారా సమన్లు జారీ వంటి అత్యాధునిక పద్దతులను కొత్త చట్టాల్లో చేర్చారు. ప్రజలకు న్యాయం చేయడమే ఏకైక ధ్యేయంగా  కొత్త చట్టాలు రూపుదిద్దుకున్నాయి. భారతీయత ఉట్టిపడేలా కొత్త చట్టాలకు రూపకల్పన చేశారు. 

 

కొత్త చట్టాలు

నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్(Criminal) కేసుల్లో విచారణ పూర్తయిన 45  రోజుల్లోనే తీర్పు ఇవ్వాలి. 60 రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి.  వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రచర్యలకు తగిన శిక్షలు విధించేలా కొత్త చట్టాల్లో మార్పులు, చేర్పులు చేశారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు శిక్ష విధించాలే చట్టాలు తెచ్చారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారి కోసం కొత్త అధ్యాయం చేర్చారు. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే యావజ్జీవ లేదా మరణశిక్ష విధించేలా చట్టాలను కఠినతరం చేశారు.

 

కొత్త చట్టాల ప్రకారం సెక్షన్ల సరళీతరం చేశారు. మొత్తం సెక్షన్లను 358కి కుదించారు. తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని సందర్శించడాన్ని తప్పనిసరి చేశారు. ఆడియో, వీడియో సాక్ష్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. మూడు నుంచి ఏడేళ్లు జైలు శిక్షపడే నేరాలకు 24 గంట్లలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త చట్టాల ప్రకారం అరెస్ట్ అయిన వెంటనే కాకుండా ఎప్పుడైనా పోలీసులు రిమాండ్ కోరవచ్చు. నకిలీనోట్ల తయారీ, స్మగ్లింగ్ వ్యవహారాన్ని ఉగ్రవాదం పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదులు నుంచి సమన్లు వరకు  అన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదు చేయనున్నారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు. పరిధితో సంబంధం లేకుండా ఎక్కడ నుంచైనా జీరో ఎఫ్‌ఐఆర్(F.I.R) నమోదు చేయడానికి అవకాశం కల్పించారు.