Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. ట్రైబ్యునల్ ఏర్పాటుపై అటార్నీ జనరల్ వెంకటరమణి తన అభిప్రాయం తెలియజేయడానికి నిరాకరించారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై ఇప్పటికే కేంద్రం ఏజీ అభిప్రాయాన్ని కోరింది. అటార్ని జనరల్ గా వెంకటరమణి బాధ్యతలు చేపట్టకముందు ఏపీ ప్రభుత్వం తరఫున కొన్ని కేసుల్లో సీనియర్ న్యాయవాదిగా హాజరైనందున తన అభిప్రాయాన్ని చెప్పలేనన్నారు. దీంతో కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు అంశాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కేంద్రం పంపింది.
సుప్రీంలో తెలంగాణ పిటిషన్, ఉపసంహరణ
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలని సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసింది. తెలంగాణ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే చాలాసార్లు వెల్లడించింది. కేంద్రం హామీతో తెలంగాణ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. అయితే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయశాఖ తన అభిప్రాయాన్ని తెలిపింది. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌తోనే కృష్ణా జలాల పంపిణీపై విచారిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయంతో ముందుకెళ్లాలని కేంద్రం భావించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఏజీ నిర్ణయాన్ని కోరింది. అయితే ఏజీ తన నిర్ణయాన్ని తెలిపేందుకు నిరాకరించారు. గతంలో ఏపీ తరఫున వాదనలు వినిపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్రం సొలిసిటర్ జనరల్ ను కొత్త ట్రైబ్యునల్ పై నిర్ణయం చెప్పాలని కోరింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గాలేరు-నగరి సుజల స్రవంతి విస్తరణ పనులు ఆపాలని తెలంగాణ లేఖ
గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం తక్షణమే ఆపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు గురువారం కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. జీఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ విస్తరణ, వేమికొండ, సర్వరాయ సాగర్ రిజర్వాయర్ల విస్తరణకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని లేఖలో తెలిపింది. ఈ ప్రాజెక్టులతో కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలిస్తున్నారని ఆరోపించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని ఏపీ ఇప్పటికే 44 వేల క్యూసెక్కులకు పెంచిందని తెలిపింది. మళ్లీ ఇప్పుడు దానికి 88 వేల క్యూసెక్కులకు పెంచే ప్రయత్నాల్లో ఉందని లేఖలో స్పష్టం చేసింది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గాలేరు, నగరికి 22 వేల క్యూసెక్కులు అదనంగా కృష్ణా జలాలు తరలించేందుకు కొత్త రెగ్యులేటర్ నిర్మాణానికి ఏపీ ప్రయత్నాలు చేస్తుందని లేఖలో వివరించింది. బచావత్ ట్రైబ్యునల్ (కేడబ్ల్యూడీటీ 1), విభజన చట్టాన్ని అతిక్రమించి ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందని , వాటిని వెంటనే నిలిపి వేయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
ఏపీ వాదన మరోలా
పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల విస్తరణ పనులు చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించినట్లు కేంద్రం లోక్‌సభలో స్పష్టం చేసింది. తెలంగాణ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు గురువారం రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల డిశ్చార్జ్ కెపాసిటీ ఇప్పటి వరకు 44 వేల క్యూసెక్కులుగా ఉందని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల విస్తరణ పనులు చేస్తున్నా, పార్లమెంట్‌కు నిజాలు చెప్పడం లేదని తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.