KCR Nanded Public Meeting: నాందేడ్ లో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు - పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
KCR Nanded Public Meeting: ఫిబ్రవరి ఐదో తేదీన నాందేడ్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోతున్న సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

KCR Nanded Public Meeting: ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని నాందేడ్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే సమావేశం కోసం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు.
నాందేడ్ జిల్లాతోపాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు సభకు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అందరూ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహించనున్న తొలిసభను విజయవంతం చేసేందుకు సంబంధించిన ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామని అన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
టీఆర్‌ఎస్... బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతం నాందేడ్ లో సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నాందేడ్ సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు అనూహ్య స్పందన వస్తుందని, నాందేడ్ జిల్లాలో అనేక గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు వ్యాఖ్యనిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పేర్కొన్నారు.