NCP's Ajit Pawar: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రతపిక్ష పార్టీల్లో పెద్ద పార్టీగా ఎన్‌సీపీ ఉన్నట్లు స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో ప్రకటించారు.


ఎన్‌సీపీ శాసనసభా పక్ష నేత జయంత్‌ పాటిల్‌ ప్రతిపక్ష నేతగా అజిత్‌ పవార్‌ పేరును ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.


ఆరు నెలలే


మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలల్లో శిందే సర్కార్ కూలిపోతుందని పవార్ అన్నారు. ముంబయిలో పార్టీ శాసనసభ్యులతో జరిగిన సమావేశంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.


" మహారాష్ట్రలో నూతనంగా ఏర్పాటైన సర్కార్ 6 నెలల్లో కూలిపోతుంది. కనుక మధ్యంతర ఎన్నికలకు మీరంతా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుత ప్రభుత్వ ఏర్పాటుతో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు. ఒకసారి మంత్రిత్వశాఖలు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేల్లో అసహనం మొదలవుతుంది. తర్వాత సర్కార్ కూలిపోవడం ఖాయం.                                                                             "




- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత

 

బలపరీక్ష

 

మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఏక్‌నాథ్ శిందే సర్కార్ గెలిచింది. ఏక్‌నాథ్ నేతృత్వంలోని సర్కార్‌కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.

బలపరీక్ష గెలవాలంటే 144 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే శిందే సర్కార్‌కు 164 మంది శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. 99 మంది శిందే సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా మరో ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే నిన్న‌టి వ‌ర‌కు ఉద్ధ‌వ్ శిబిరంతో ఉన్న ఎమ్మెల్యే సంతోష్ బంగ‌ర్ ఇవాళ బ‌ల‌ప‌రీక్ష‌లో ఏక్‌నాథ్‌కు స‌పోర్ట్ ఇచ్చారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.


Also Read: CM Eknath Shinde Speech: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కంటతడి- వీడియో వైరల్