Dhoom-style Robbery: బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సినిమా 'ధూమ్' చూశారా? ఇదేం ప్రశ్న.. అనుకుంటున్నారా? అయితే ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా దొంగతనం చేసి తప్పించుకునే సన్నివేశాలు ఎన్ని సార్లు చూసినా మాంచి కిక్కిస్తాయి. అయితే ఆ సినిమా చూసి ఇన్‌స్పైర్‌ అయిన కొందరు దొంగలు తాజాగా ఓ షాకిచ్చారు.






స్కూల్‌లో


ఒడిశాలోని నవరంగ్‌పుర్‌లో కొంతమంది దొంగలు ఓ స్కూల్‌లో చొరబడి కంప్యూటర్లు, ప్రింటర్లు ఎత్తుకుపోయారు. అయితే అంతటితో ఆగని దొంగలు చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్‌ విసిరారు. కొన్ని ఫోన్‌ నంబర్లు కూడా బోర్డుపై రాసివెళ్లారు.


ధూమ్ 4


ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉన్న కంప్యూటర్లు, జెరాక్స్‌ మెషిన్లు, ప్రింటర్లు ఇలా కొన్ని వస్తువులు ఎత్తుకుపోయిన దొంగలు 'ధూమ్‌ 4' తొందర్లో వస్తుందని రాసివెళ్లారు. పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. 


శనివారం ఉదయం స్కూల్‌కి వచ్చిన ప్యూన్‌.. హెడ్‌మాస్టర్‌ రూమ్‌ డోర్‌ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అందులో వస్తువులు మాయమైపోవడాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలిపాడు. దీంతో స్కూల్‌ హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు చేసుకున్న ఖతీగూడ పోలీసులు సైంటిఫిక్ టీమ్, డాగ్​ స్క్వాడ్​ సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో నందహండి బ్లాక్‌లోని దహన్‌ స్కూల్‌ ఆఫీసు రూమ్​లో ఉన్న కంప్యూటర్లను దొంగలు దోచుకెళ్లారు. ఆ తర్వాత బ్లాక్‌బోర్డ్‌పై కొన్ని మొబైల్ నంబర్లు కూడా రాశారు. వాటిలో ఆ పాఠశాలలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడి ఫోన్​ నెంబర్​ కూడా ఉంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read: Karnataka: జుట్టు రాలిపోతుందని డిప్రెషన్- యువతి ఆత్మహత్య!


Also Read: Denmark Shooting: షాపింగ్‌మాల్‌లో కాల్పుల మోత- ముగ్గురు మృతి