మౌనంగా ఉండనే ఉండను: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా


ప్రతిపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించినప్పటి నుంచి ఆయన కాస్త దూకుడుగానే మాట్లాడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సభలోనూ యశ్వంత్ సిన్హా తన వాణిని గట్టిగానే వినిపించారు. సాధారణంగా రాష్ట్రపతి అంటే మౌనంగా ఉంటారు. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడే అవకాశం పెద్దగా ఉండదు. అయితే తాను మాత్రం అలాంటి రాష్ట్రపతిని కాదని చాలా కచ్చితంగా చెబుతున్నారు యశ్వంత్ సిన్హా. "మౌనంగా ఉండనే ఉండను" అని ప్రతిపక్షాలు ఎంపిక చేసినప్పుడే తేల్చి చెప్పారు. అటు ప్రత్యర్థి ద్రౌపది ముర్ముకీ సవాళ్లు విసురుతున్నారు. ఒకవేళ ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే ఎన్‌డీఏ చేతిలో రబ్బర్ స్టాంప్‌గా మిగిలిపోకుండా ఉండగలరా అని ప్రశ్నించారు. ఇలా ఉండనని హామీ ఇస్తూ ఆమె ప్రతిజ్ఞ చేయాలనీ అన్నారు యశ్వంత్ సిన్హా. భారతీయుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.





 


రబ్బర్‌స్టాంప్‌గా మిగిలిపోయే ప్రసక్తే లేదు..


తాను రాష్ట్రపతిగా గెలిస్తే, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని, రబ్బర్‌స్టాంప్‌గా మిగిలిపోనని స్పష్టం చేశారు. ఇదే హామీని ద్రౌపది ముర్ము కూడా ఇవ్వాలని అన్నారు. మాజీ భాజపానేత అయినప్పటికీ యశ్వంత్ సిన్హా మోదీ సర్కార్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. భాజపా హయాంలో రాజ్యాంగం అప్రతిష్ఠపాలవుతోందని, ఈ అరాచకాన్ని అడ్డుకుంటానని స్పష్టం చేశారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మలా కాకుండా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని వెల్లడించారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవి అత్యున్నతమైందే అయినా కేవలం "కేంద్రం కనుసన్నల్లో ఉండే వ్యక్తి" అనే ముద్ర పడిపోయింది. ఇందుకు కారణం...కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రపతిని నామినేట్ చేయటం. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్  కోవింద్‌పైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగామారిపోయారన్న విమర్శలూ ఎదుర్కొన్నారు. అందుకే యశ్వంత్ సిన్హా అలాంటి వ్యాఖ్యలు చేశారు. 


Also Read: Agnipath Scheme: 'అగ్నిపథ్‌'ను రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్- వచ్చే వారం విచారణ