Gold Smuggling: బంగారం స్మగ్లర్లకు ముంబయి ఎయిర్‌పోర్ట్ స్వర్గధామంలా మారింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కేవలం 11 నెలల్లోనే రూ.360 కోట్ల విలువ చేసే 604 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ బంగారం పట్టుబడింది. కాగా.. గతేడాదితో పోలిస్తే 2022-23లో స్మగ్లింగ్ చేస్తుండగా స్వాధీనం చేసుకున్న బంగారం 91 కిలోలు పెరిగింది.
ముంబయి ఎయిర్‌పోర్ట్‌దే అగ్రస్థానం
మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉండటంతో బంగారం స్మగ్లర్లకు ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం రవాణా కేంద్రంగా మారింది. ఆభరణాల వ్యాపారులు సహా అనేక సిండికేట్‌లు స్మగ్లర్లకు ఆర్థికసాయం చేస్తున్నాయని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. దేశంలోని ఇతర మూడు మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలకు కూడా అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలు ప్రాధాన్యమిస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా బంగారం స్మగ్లింగ్ కేసులు పెరుగుతున్నాయి. గత ఏడాది 55 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది 124 కిలోలు పట్టుబడింది.
కరోనా కాలంలో తగ్గిన రవాణా
కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు, 2019-20లో, ఢిల్లీ విమానాశ్రయంలో 494 కిలోల స్మగ్లింగ్ బంగారం, ముంబై విమానాశ్రయలో 403 కిలోలు, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 392 కిలోలు బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2020-21లో బంగారం స్మగ్లింగ్ గణనీయంగా తగ్గినప్పుడు కూడా, చెన్నై విమానాశ్రయంలో 150 కిలోలు, కోజికోడ్‌లో 146.9 కిలోలు, ఢిల్లీలో 88.4 కిలోలు, ముంబైలో 87 కిలోల స్మగ్లింగ్ రాకెట్లను ఛేదించారు.
భారీగా బంగారం స్వాధీనం
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.9 కోట్ల విలువైన 18 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సహకరించినందుకు అంతర్జాతీయ ఎయిర్‌లైన్ సిబ్బంది సహా ఇద్దరు కెన్యా జాతీయులను కస్టమ్స్ అధికారులు ఫిబ్రవరి 10న అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 23న మెషిన్ రోటర్లలో బంగారం రహస్యంగా తరలిస్తున్న కల్బాదేవి జ్యువెల్లర్స్ నుంచి 22 కోట్ల రూపాయల విలువైన 37 కిలోల బంగారంతో పాటు 2.3 కోట్ల రూపాయల నగదును డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. ఈ విమానాశ్రయంలో ఈ ఏడాది భారీగా బంగారం పట్టుబడిన ఘటనల్లో ఈ రెండూ ముఖ్యమైనవి. గత నవంబర్‌లో ఈ ఎయిర్‌పోర్టులో రూ.28 కోట్ల విలువైన 53 కిలోల బంగారం స్మగ్లింగ్‌పై విచారణ చేపట్టిన ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం నీరజ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది.
33 శాతం పెరిగిన అక్రమ రవాణా
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం వల్ల కొవిడ్‌కు ముందు కాలంతో పోలిస్తే 2022లో భారతదేశంలో బంగారం అక్రమ రవాణా 33 శాతం పెరిగి 160 టన్నులకు చేరుకుంది. అదనంగా 3శాతం GSTతో, వినియోగదారులు శుద్ధి చేసిన బంగారంపై 18.45 శాతం పన్ను చెల్లిస్తారు. బంగారం ధరలు 10 గ్రాములకు రూ.60,000 దాటడంతో బంగారం అక్రమ రవాణా ద్వారా వచ్చే లాభం 15 శాతం నుంచి 20 శాతానికి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కాగా.. పురుషులు 20 గ్రాముల బంగారాన్ని, మహిళలు 40 గ్రాముల బంగారాన్ని చట్టబద్ధంగా తీసుకురావడానికి మన దేశం అనుమతిస్తుంది.
ఏటా 720 టన్నుల పుత్తడి
ప్రతి సంవత్సరం మొత్తం 720 టన్నుల బంగారం భారతదేశానికి వస్తుందని, అందులో 380 టన్నులు 15 శాతం దిగుమతి సుంకం, 3శాతం ఐజీఎస్‌టీతో చట్టబద్ధంగా వస్తే.. మిగిలిన 340 టన్నులు అక్రమంగా రవాణా చేయబడుతుందని ఆభరణాల వ్యాపారులు తెలిపారు. భారతదేశం సంవత్సరానికి దాదాపు 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుందని IRS అధికారులు చెబుతున్నారు.
అత్యధికంగా ఆ దేశాల నుంచే..
డిసెంబర్ 2022లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన 'భారతదేశంలో స్మగ్లింగ్ 2021-22' నివేదిక 2021-22లో స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారంలో 37 శాతం మయన్మార్ నుంచి 20 శాతం పశ్చిమాసియా నుంచి వచ్చినట్టు పేర్కొంది. మొత్తంగా, పట్టుబడిన స్మగ్లింగ్ బంగారంలో 73 శాతం మయన్మార్, బంగ్లాదేశ్ ద్వారా దేశానికి వచ్చింది. అయితే భారతదేశంలో అక్రమంగా వ్యాపారం చేసే బంగారం స్వాధీనం రేటు కేవలం 2 శాతం మాత్రమేనని WGC వెల్లడించడం కొసమెరుపు.